ఉన్నది 11 మందే.
భద్రాచలం అగ్నిమాపక విభాగంలోని 11 మందితోనే సహాయక చర్యలు
తగినంత సిబ్బందితో ప్రత్యేక రక్షణ దళం ఏర్పాటు చేస్తే మేలు
భద్రాచలంఅర్బన్: గోదావరి ఉప్పొంగితే పలు గ్రామాలకు రాకపోకలు స్తంభిస్తున్నాయి. మున్నేరు ఉగ్రరూపం దాల్చితే కాలనీలు నీటమునుగుతున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు కురిసిన ప్రతిసారీ ఇవే పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఆ సమయంలో ప్రాణాలు కాపాడేందుకు ప్రత్యేక రక్షణ బృందాలను విజయవాడ నుంచి రప్పించాల్సి వస్తోంది. అవి చేరుకునేలోపు పరిస్థితులు మరింత విషమించే ప్రమాదముంది. ఈ నేపథ్యంలో భద్రాచలం కేంద్రంగా శాశ్వత విపత్తు రక్షణ దళం ఏర్పాటు అవసరం స్పష్టమవుతోంది.
సిబ్బంది భద్రతకు ప్రాధాన్యమివ్వాలి
2022 జూలైలో గోదావరికి వచ్చిన భారీ వరదలు భద్రాచలం పరిసర ప్రాంతాలను ముంచెత్తాయి. 2024 సెప్టెంబర్‌లో మున్నేరు వరదలు ఖమ్మం నగరాన్ని అతలాకుతలం చేశాయి. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాల్సి వచ్చింది. తాజాగా సత్తుపల్లి మండలం బేతుపల్లి చెరువులో చిక్కుకున్న మత్స్యకారులను రక్షించేందుకు వెళ్లిన బృందాల పడవలు బోల్తాపడటంతో రక్షణ సిబ్బంది సైతం ప్రమాదంలో చిక్కుకున్నారు. అనంతరం సహాయక చర్యల్లో పాల్గొన్న ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందం మత్స్యకారులతోపాటు ఎస్డీఆర్‌ఎఫ్ సిబ్బందిని రక్షించింది. అయితే ఈ ఘటన రక్షించేందుకు వెళ్లేవారి భద్రతకూ ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరాన్ని గుర్తుచేసింది.
భద్రాచలంలో శాశ్వత రక్షణ దళం..
భద్రాద్రి జిల్లాలో కొత్తగా ఏర్పాటు చేసిన డీడీఆర్‌ఎఫ్ సిబ్బందికి తొలుత చిన్న చెరువుల్లో, అనంతరం గోదావరిలో రక్షణ చర్యలపై శిక్షణ ఇచ్చారు. సాధారణ నీటిలో సాధన చేయడానికి, ఉధృతంగా ప్రవహించే వరదలో ప్రాణాలు కాపాడటానికి ఎంతో తేడా ఉంటుంది. జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం దేశవ్యాప్తంగా ప్రత్యేక సహాయక చర్యలు చేపడుతుండగా, రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా పనిచేస్తోంది. ఈ నేపథ్యంలో భద్రాచలంలో సైనిక స్థాయి శిక్షణ, ఆధునిక పరికరాలతో ప్రత్యేక రాష్ట్ర రక్షణ దళాన్ని, ఎన్‌డీఆర్‌ఎఫ్ ప్రాంతీయ కేంద్రం ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు. వరదొచ్చాక బృందాలను రప్పించడం కంటే వరద రాకముందే రక్షణ వ్యవస్థను సిద్ధం చేస్తే ప్రజల ప్రాణాలకు భరోసా కల్పించచ్చు.
భద్రాచలం అగ్నిమాపక కేంద్రంలో 17 మంది సిబ్బంది ఉండాల్సి ఉండగా ప్రస్తుతం 11 మందే విధులు నిర్వహిస్తున్నారు. అగ్నిప్రమాదాల నివారణతోపాటు భద్రాచలంలో జరిగే ప్రధాన ఉత్సవాలు, ఉమ్మడి జిల్లాలో వరద సహాయక చర్యలకు వీరినే వినియోగిస్తున్నారు. దీంతో వారిపై అదనపు భారం పడుతోంది. ఒక ప్రాంతంలో వరద సహాయక చర్యల్లో పాల్గొంటున్న సమయంలో మరోచోట అగ్నిప్రమాదం సంభవిస్తే పరిస్థితి ఏమిటనే ప్రశ్న తలెత్తుతోంది. ఈ నేపథ్యంలో ఖాళీగా ఉన్న ఆరు పోస్టులను భర్తీ చేయడంతోపాటు వరద సహాయక చర్యల కోసం ప్రత్యేకంగా మరో 16 మందితో ఎస్‌డీఆర్‌ఎఫ్ ప్రత్యేక బృందాన్రి ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. అగ్నిమాపక విధులు, వరదల్లో ప్రాణరక్షణ చర్యలకు వేర్వేరు బృందాలను అందుబాటులో ఉంచితే అత్యవసర పరిస్థితుల్లో వేగంగా స్పందించే అవకాశం ఉంటుంది.
గోదావరి, మున్నేటి వరదలతో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ముప్పు


