జెన్‌కో పాఠశాలల ఉపాధ్యాయుల సందర్శన | - | Sakshi
Sakshi News home page

జెన్‌కో పాఠశాలల ఉపాధ్యాయుల సందర్శన

Nov 6 2026 12:38 AM | Updated on Nov 6 2026 12:38 AM

మణుగూరు రూరల్‌: తెలంగాణ జెన్‌కో పరిధిలోని డీఏవీ విద్యాలయాల ప్రిన్సిపాళ్లు, ఉపాధ్యాయులు గురువారం బీటీపీఎస్‌ టౌన్‌షిప్‌లోని డీఏవీ హైస్కూల్‌ను సందర్శించారు. కంప్యూటర్‌ ల్యాబ్‌, క్రీడా ప్రాంగణం, పార్కింగ్‌ సౌకర్యాలను పరిశీలించారు. కార్పొరేట్‌ పాఠశాలలకు ధీటుగా ఉన్న మౌలిక సదుపాయాలు, బోధనా విధానాలు ఉన్నాయని పేర్కొన్నారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి సీబీఎస్‌ఈ సిలబస్‌ అమలు కానుండడంతో బీటీపీఎస్‌ ఉద్యోగుల పిల్లలకు మెరుగైన విద్యావకాశాలు అందుతాయన్నారు. అనంతరం పాఠశాల అభివృద్ధికి కృషి చేసిన సీఈ బిచ్చన్నతో సమావేశమయ్యారు. శాలువాతో సన్మానించారు.

ఐఎఫ్‌ఎంఐఎస్‌పై

శిక్షణ

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): ఇంటిగ్రేటెడ్‌ ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్‌ ఇన్ఫర్‌మేషన్‌ సిస్టం (ఐఎఫ్‌ఎంఐఎస్‌) జిల్లా స్థాయి కాస్కేడింగ్‌ శిక్షణ కార్యక్రమాన్ని గురువారం కలెక్టరేట్‌లో నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన 450 మంది అధికారులు, ఉద్యోగులు హాజరయ్యారు. ప్రభుత్వ శాఖల్లో డిజిటల్‌ ఆర్థిక పరిపాలన వ్యవస్థను సమర్థవంతంగా అమలు చేయడంలో భాగంగా ఈ శిక్షణ నిర్వహించారు. ఆయా మాడ్యూల్స్‌ వినియోగ విధానాలు, కార్యాచరణ పద్ధతులు, ఆర్థిక నిర్వహణలో వాటి ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. జిల్లా ఖజానా అధికారి జక్కా మీనాక్షి, ఇతర అధికారులు సైదులు, పి.శ్రీనివాస్‌, బి శారద, అక్బర్‌ పాషా పాల్గొన్నారు. జి.రష్మి తేజస్వీ, అరుణ్‌ పవర్‌ పాయింట్‌ ద్వారా అవగాహన కల్పించారు.

సత్తుపల్లి

సబ్‌ రిజిస్ట్రార్‌గా మధు

బూర్గంపాడుకు సునీత

ఖమ్మంమయూరిసెంటర్‌: టీజీపీఎస్సీ గ్రూప్‌–2 నోటిఫికేషన్‌ ద్వారా నూతనంగా ఎంపికై , శిక్షణ పూర్తి చేసుకున్న సబ్‌ రిజిస్ట్రార్లకు ప్రభుత్వం పోస్టింగ్‌లు కేటాయించింది. ఇందులో భాగంగా జోన్‌–4 పరిధి సత్తుపల్లి సబ్‌ రిజిస్ట్రార్‌గా నకారకాంతి మధును నియమిస్తూ రాష్ట్ర రిజిస్ట్రేషన్లు, స్టాంప్‌ల శాఖ కమిషనర్‌ అండ్‌ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ రాజీవ్‌గాంధీ హనుమంతు ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, సత్తుపల్లి సబ్‌ రిజిస్ట్రార్‌గా గురువారం విధుల్లో చేరిన మధు రెండు రోజుల పాటు సెలవులో వెళ్లారు. ఇక వరంగల్‌లో రిజిస్ట్రార్‌ ఆడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్న సునీతను బూర్గంపాడు సబ్‌ రిజిస్ట్రార్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

పాఠశాలలను

పరిశుభ్రంగా ఉంచాలి

అశ్వారావుపేట/ములకలపల్లి: పాఠశాలలను పరిశుభ్రంగా ఉంచాలని డీఈఓ శంభూ ప్రసాద్‌ సూచించారు. అశ్వారావుపేట, ములకలపల్లి మండలాల్లో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో వరద నీరు చేరిన పాఠశాలలను గురువారం పరిశీలించారు. ఆవరణ బురదమయం కావడంతో అశ్వారావుపేట మండలంలోని పాఠశాలలకు సెలవులు ఇచ్చారు. అయినా డీఈఓ పర్యటించి పాఠశాల పరిస్థితులను పరిశీలించారు. అనంతరం ఎంఈఓ కార్యాలయాన్ని సందర్శించి రికార్డులను పరిశీలించారు. బురదమయంగా మారిన ములకలపల్లి మండలం తాళ్లపాయ ప్రాథమిక పాఠశాలను పరిశీలించారు. సర్పంచ్‌ సహకారంతో పాఠశాలను సత్వరమే పరిశుభ్రం చేయించాలని సూచించారు. అనంతరం కంపగూడెం స్కూల్‌ సందర్శించి, రికార్డులను పరిశీలించారు. ఎంఈఓలు పి ప్రసాద్‌ రావు, జగపతి, సత్యనారాయ, సీఆర్పీ ప్రభాకరాచార్యులు, సర్పంచ్‌ గడ్డం సుజాత పాల్గొన్నారు.

బ్యాంక్‌ అకౌంట్‌ నుంచి నగదు మాయం

ఇల్లెందురూరల్‌: మండలంలోని విజయలక్ష్మినగర్‌కు చెందిన బానోత్‌ కవిత హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ అకౌంట్‌ నుంచి నగదు మాయమైంది. పోలీసుల కథనం ప్రకారం.. ఫోన్‌ మాట్లాడుతున్న క్రమంలో మూడు సార్లు సెల్‌కు అప్‌డేట్‌ చేయాలని మెసేజ్‌ వచ్చింది. ఆ వెంటనే ఫోన్‌ స్విచ్చాఫ్‌ అయింది. ఆ తర్వాత మూడు దఫాలుగా రూ.95 వేలు డ్రా అయినట్లు మెసేజ్‌ వచ్చింది. బాధితురాలు సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రూ.85వేల నగదు ఫ్రీజ్‌ చేశారు. గురువారం ఇల్లెందు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసినట్లు సీఐ సురేష్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement