వెంకమ్మ చెరువుకు భారీ గండి | - | Sakshi
Sakshi News home page

వెంకమ్మ చెరువుకు భారీ గండి

Nov 6 2026 12:38 AM | Updated on Nov 6 2026 12:38 AM

సుమారు 70 మీటర్ల మేర కొట్టుకుపోయిన ఆనకట్ట

అంతర్రాష్ట్ర రహదారి అప్రోచ్‌ రోడ్డు కోత

అశ్వారావుపేటరూరల్‌: మురసు తుపాన్‌ ప్రభావంతో కురిసిన కుండపోత వర్షానికి అశ్వారావుపేట మండలం ఊట్లపల్లి వద్దనున్న వెంకమ్మ చెరువుకు వరద పోటెత్తింది. ఎగువ ప్రాంతంలోని దమ్మపేట మండలంలోని చెరువులు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వరదకు బుధవారం ఉదయం నుంచే వెంకమ్మ చెరువు అలుగుపోసింది. గురువారం తెల్లవారుజామున ఒక్కసారిగా వరద ఉధృతరూపం దాల్చడంతో అలుగు పక్కనే ఆనకట్టకు సుమారు 70 మీటర్ల మేర భారీ గండి పడింది. దీంతో వరద నీరంతా పొలాల్లోకి ప్రవహించడంతో సుమారు 800 ఎకరాల్లో వరి పంటకు నష్టం వాటిల్లింది. వేరుశెనగ, మినుము పంటల్లో ఇసుక, మట్టి దిబ్బలు పేరుకుపోయాయి. పామాయిల్‌, కొబ్బరి తోటల్లో వరదనీరు పోటెత్తింది. దిగువన ఉన్న అశ్వారావుపేట–భద్రాచలం అంతరాష్ట్ర రహదారిపై దాదాపు నాలుగు గంటలపాటు వరద ప్రవహించింది. ఉధృతికి 700 మీటర్ల మేర బీటీ రహదారి అప్రోచ్‌ కొట్టుకుపోయింది. రెండు చోట్ల కల్వర్టులు ధ్వంసమయ్యాయి. వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ క్రమంలోనే నారాయణపురం గ్రామానికి చెందిన సుబ్బరావునే వ్యక్తి ద్విచక్రవాహనం అదుపుతప్పి వరదనీటిలో కొట్టుకుపోగా, గమనించిన స్థానికులు పోలీసులు కలిసి తాళ్ల సాయంతో సురక్షితంగా బయటకు తీశారు. కాగా నీటిపారుదల శాఖ లెక్కల ప్రకారం చెరువు ఆయకట్టు 1280 ఎకరాలు ఉండగా, అదనంగా మరో రెండు వేల ఎకరాల్లో రైతులు పంటలను సాగు చేస్తున్నారు.

40 ఏళ్ల క్రితం కూడా..

వెంకమ్మ చెరువు 1986లో కురిసిన అతి భారీ వర్షాలతో ఆనకట్ట మధ్య భాగంలో సుమారు 20 మీటర్ల మేర గండి పడింది. ఆ తర్వాత నుంచి ఇప్పటిదాకా భారీ వర్షాలను తట్టుకుంది. సుమారు 30 గంటల వ్యవధిలో 41 సెం.మీ. వర్షపాతం నమోదు కావడం, దమ్మపేటలోని చెరువుల నుంచి కూడా భారీగా వరద రావడంతో చెరువుకు గండి పడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement