కల్లూరు రూరల్: పురుగుల మందు తాగిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. కల్లూరు మండలం చండ్రుపట్లకు చెందిన మర్సకట్ల శేఖర్ ఇంట్లో డబ్బులు తీసుకెళ్లి దుబారా ఖర్చులు చేస్తుండటంతో భార్య రాణి వారించింది. ఈక్రమాన ఇద్దరి మధ్య ఘర్షణ జరగగా, శేఖర్ గతనెల 23వ తేదీన పురుగుల మందు తాగాడు. ఆయనకు ఆస్పత్రిలో చికిత్స చేయిస్తుండగా గురువారం మృతి చెందాడు. ఘటనపై ఆయన భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై నాగరాజు తెలిపారు.
బైక్ కొనివ్వలేదని
యువకుడు ఆత్మహత్య
ఖమ్మంక్రైం: స్పోర్ట్స్ బైక్ కావాలని అడిగితే తండ్రి కొనివ్వలేదని ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. కూసుమంచి మండలం బోడియాతండాకు చెందిన ధరావత్ జశ్వంత్‌తేజ(20) ఖమ్మంలో ఓ ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ చదువుతూ సారధినగర్ ప్రాంతంలోని అద్దె గదిలో ఉంటున్నాడు. కొన్నాళ్లుగా ఆయన తనకు స్పోర్ట్ బైక్ కావాలని తండ్రిని అడుగుతుండగా, ఈ ఏడాది కరువుతో పంటలు లేనందున మరేదైనా బైక్ తీసుకోవాలని నచ్చచెప్పాడు. అయినా జశ్వంత్ స్పోర్ట్ బైక్ కోసం పట్టుబట్టడంతో తన వల్ల కాదని తండ్రి చెప్పారు. ఈక్రమాన గత నెల 14న అద్దె గదిలో గడ్డి మందు తాగిన జశ్వంత్‌ను స్థానికుల ఇచ్చిన సమాచారంతో ఆస్పత్రిలో చేర్పించారు. ఈమేరకు పరిస్థితి విషమించడంతో గురువారం మృతి చెందాడు, ఘటనపై ఆయన సోదరుడు చరణ్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.
ఖమ్మం లీగల్: అప్పు చెల్లించే క్రమాన ఇచ్చిన చెక్కు చెల్లకపోవడంతో ఏడాది జైలుశిక్ష విధిస్తూ ఖమ్మం ఒకటో అదనపు ప్రథమ శ్రేణి మెజిస్ట్రేట్ బిక్కం రజిని గురువారం తీర్పు చెప్పారు. ఖమ్మంకు చెందిన ఏ.నారాయణరావు వద్ద ముదిగొండ మండలం పమ్మి గ్రామానికి చెందిన వడ్డే సతీష్ 2017 అక్టోబర్‌లో రూ.6లక్షల అప్పు తీసుకున్నాడు. తిరిగి 2019 డిసెంబర్‌లో రూ.9.12లక్షలకు చెక్కు జారీ చేసినా ఆయన అకౌంట్ను బ్లాక్ చేయడంతో నిరాదరణకు గురైంది. దీంతో నారాయణరావు ప్రైవేట్ కేసు దాఖలు చేయగా విచారించిన న్యాయమూర్తి సాక్షాధారాలు పరిశీలన అనంతరం తీర్పు వెలువరించారు. ఈమేరకు సతీష్‌కు ఏడాది జైలుశిక్ష విధించడమే కాక ఫిర్యాదికి రూ.9.12లక్షలు చెల్లించాలని తీర్పు చెప్పారు.


