పాల్వంచరూరల్: ఎల్‌నినో ప్రభావం కారణంగా ఇప్పటివరకు చెరువుల్లోకి నీరు అంతంతమాత్రంగానే చేరింది. మురసు తుపాన్ ప్రభావంతో రెండు, మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు చెరువులు నిండుతున్నాయి. కుంటలు, చెక్ డ్యామ్‌లు నిండుకుండలా మారుతున్నాయి. జిల్లాలో మొత్తం 2,384 చెరువులు ఉండగా, ప్రస్తుతం 510 చెరువులు అలుగు పోస్తున్నాయి. 139 చెరువుల్లోకి 25 శాతం మేర నీరు చేరింది. 554 చెరువులు 25నుంచి 50 శాతం వరకు, 726 చెరువులు 50 నుంచి 75 వరకు, 455 చెరువులు 75 శాతం నుంచి 100 శాతం వరకు నిండాయని జలవనరులశాఖ సీఈ శ్రీనివాసరెడ్డి తెలిపారు. బుధవారం కురిసిన భారీ వర్షానికి వాగులు ఉప్పొంగి వరద నీరు వచ్చి చెరువుల్లో చేరుతోంది. పాల్వంచ మండలం దంతలబోరు, బండ్రుగొండ, నాగారం గ్రామాల చెరువులు, మందేరకలపాడు వద్ద రాళ్లవాగు పిక్‌డ్యామ్ కూడా అలుగుపోస్తున్నాయి. సోములగూడెం, సూరారం చెక్ డ్యామ్‌లు పొంగిపొర్లుతుండగా, రేగులగూడెం పంచాయతీలోని ఎర్రసాని చెరువు అలుగుపారుతోంది.
తహసీల్దార్ వేధింపులు?
సబ్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన సిబ్బంది!
మణుగూరు టౌన్: తహసీల్దార్ వ్యవహార శైలిపై కార్యాలయ సిబ్బంది బుధవారం భద్రాచలం సబ్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం... ఫీల్డ్ విధులకు వెళ్లిన కొందరు సిబ్బంది ఆలస్యంగా వస్తున్నారని, సర్టిఫికెట్ల జారీలో ఆలస్యం చేస్తున్నారని, ఎస్‌ఐఆర్, ఎమ్మెల్సీ ఓటు నమోదులో జాప్యం చేస్తున్నారని తహసీల్దార్ సిబ్బందిని మందలించినట్లు సమాచారం. దశాబ్దాల అనుభవం ఉన్న అధికారులను ఉద్దేశించి ‘చేతగాకపోతే జీపీఓగా పనిచేసుకోండి... కలెక్టర్ దగ్గర మీ సంగతి తేలుస్తా, మెమోలు జారీ చేయిస్తా. అంటూ సిబ్బందిని దుర్భాషలాడినట్లు సమాచారం. దీంతో కొందరు సబ్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.
ట్రాక్టర్ చక్రాల దొంగలు అరెస్టు
పెనుబల్లి: ట్రాక్టర్ల పుల్ వీల్స్‌ను ఎత్తుకెళ్తున్న ముఠా ను అరెస్ట్ చేసినట్లు సత్తుపల్లి రూరల్ సీఐ సరవయ్య తెలిపారు. వీఎం బంజర్, వేంసూరు పోలీసుస్టేషన్ల పరిధిలో నమోదైన కేసులకు సంబంధించి ఐదుగురిని అరెస్టు చేయడంతో పాటు రూ. 6.50 లక్షల విలువైన పుల్‌వీల్స్ స్వాధీనం చేసుకున్నామని వెల్ల డించారు. వీఎం బంజర్ స్టేషన్ బుధవారం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. ఎస్‌ఐ షాకీర్, సిబ్బంది టి.వెంకటేశ్వర్లు, ఎస్.రాజమల్లు, జి.శ్రీనివాస్‌తో కలిసి వాహనా తనిఖీ చేస్తుండగా ముత్తగూడెం గ్రీన్‌ఫీల్డ్ హైవే బ్రిడ్జి వద్ద రెండు బొలెరో వాహనాల్లో ట్రాక్టర్ పుల్ వీల్స్‌ను తీసుకెళ్తున్న ఐదుగురిని గుర్తించారు. వీరి ఆరా తీయగా చక్రాలను చోరీ చేసినట్లు బయటపడింది. ఈమేరకు సత్తుపల్లి, దమ్మపేట, అశ్వారావుపేట మండలాలకు చెందిన పంతంగి చెన్నకేశవ, కుంట రాఘవేంద్ర, మేకల గోవర్దన్, పుచ్చి ముత్తయ్య, గోపిన నవీన్ పట్టుబడగా, ఎస్,కే.మస్తాన్ పరారీలో ఉన్నాడని సీఐ తెలిపారు. నిందితులను సత్తుపల్లి కోర్టులో హాజరుపర్చి, రిమాండ్‌కు తరలించినట్లు చెప్పారు. కాగా, కేసు విచారణలో కీలకంగా వ్యవహరించిన సీఐ నరసయ్య, వీఎం బంజర్, వేంసూరు ఎస్‌ఐలు షాకీర్, పల్లెల ప్రదీప్ ను సీపీ సునీల్‌దత్, ఏసీపీ వసుంధర యాదవ్ అభినందించారు.


