● భద్రాచలంలో వెంటాడుతున్న ప్రభుత్వ స్థలాల కొరత ● ఆఫీసులన్నీ ఒకే సముదాయంలోకి చేర్చితే మెరుగైన సేవలు ● ఇప్పటి కార్యాలయాల స్థలాలు ఇతర అభివృద్ధి అవసరాలకు.. ● స్టేషన్ ఘన్‌పూర్ తరహాలో కాంప్లెక్స్ నిర్మించాలని స్థానికుల విన్నపం
భద్రాచలం: గిరిజన ప్రాంతాలకు ముఖద్వారంగా, దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం నియోజకవర్గ కేంద్రంలో ఇంటిగ్రేటెడ్ రెవెన్యూ డివిజనల్ ఆఫీసెస్ కాంప్లెక్స్ నిర్మాణ ఆవశ్యకత ఏర్పడింది. వివిధ ప్రభుత్వ శాఖల కార్యాలయాలను ఒకే సముదాయంలో ఉంటే ప్రజలకు మెరుగైన సేవలు అందే అవకాశం ఉంది. ప్రముఖ పుణ్యక్షేత్రంలో ప్రభుత్వ స్థలాల సమర్థ వినియోగంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.
శిథిలావస్థకు చేరిన పలు కార్యాలయాలు
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనలో భద్రాచలం ఎంతో చిన్నబోయింది. పట్టణం మినహా మండలం అంతా ఆంధ్రాలో కలిసింది. దీంతో ప్రభుత్వ స్థలాలు తగ్గిపోయి అభివృద్ధికి ఆటంకంగా మారింది. ఈ నేపథ్యంలో భద్రాచలంలో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలను ఒక్క చోటకు చేర్చితే, ఇప్పటి కార్యాలయాల స్థలాలను ఇతర అభివృద్ధి అవసరాలకు వినియోగించుకోవచ్చు. దీనికి తోడు ప్రస్తుతం ఉన్న తహసీల్దార్ కార్యాలయం, సబ్ కలెక్టర్ ఇతర ప్రభుత్వ కార్యాలయాలు శిథిలావస్థకు చేరాయి. వీటి మరమ్మతులకు తరచూ నిధులు కేటాయించాల్సి వస్తోంది. మరికొన్ని కార్యాలయాలను ఐటీడీఏ కాంప్లెక్స్‌లోకి మార్చారు. ఈ సమస్యలన్నింటికీ ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్‌తో పరిష్కారం లభిస్తుందని చెప్పవచ్చు. స్టేషన్ ఘన్‌పూర్ డివిజన్ కేంద్రంలో ఈ తరహా నిర్మాణం జరుగుతుండటంతో, భద్రాచలంలో కూడా నిర్మాణం చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఎమ్మెల్యే, ఎంపీలు, ఉన్నతాధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.
ఒకే ప్రాంగణంలో ఉంటే సేవల మెరుగు
ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ అందుబాటులోకి వస్తే వివిధ ప్రభుత్వ శాఖల సేవలు ఒకే ప్రాంగణంలో ఉంటాయి. దీంతో ప్రజలు ప్రభుత్వ పనుల కోసం వేర్వేరు కార్యాలయాల చుట్టూ తిరిగే ఇబ్బందులు తగ్గుతాయి. పరిపాలనా వ్యవస్థ మరింత సమర్థవంతంగా పనిచేయడంతోపాటు, భద్రాచలం డివిజన్ కేంద్రంగా ప్రభుత్వ సేవలకు మరింత ప్రాధాన్యత లభిస్తుంది. డివిజన్ ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ నిర్మాణం, కార్యాలయాల తరలింపు వంటి అంశాలపై సంబంధిత శాఖలు సమగ్రంగా ప్రణాళిక రూపొందిస్తే ప్రభుత్వ భవనాలు, స్థలాల వినియోగాన్ని మరింత సమర్థవంతంగా నిర్వహించే అవకాశం ఉంటుంది.
కూనవరం రోడ్డులో అటవీశాఖ స్థలం..
భద్రాచలంలో ప్రస్తుతం రామాలయానికి వెళ్లే దారిలో అగ్నిమాపక కేంద్రం, ఆ తర్వాత సబ్ కలెక్టర్ కార్యాలయం, పోలీసు, తహసీల్దార్ కార్యాలయాలు, సబ్ జైల్ ఉన్నాయి. ఇదే అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత స్థలంగా మారింది. బస్టాండ్ పక్కన, కూనవరం రోడ్డులో ఉన్న అటవీశాఖ స్థలాన్ని వినియోగించుకునే అవకాశం ఉంది. కొత్త మార్కెట్‌లో ఖాళీగా ఉన్న స్థలంలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌కు అవకాశం ఉన్నా అది ప్రతిపాదన దశలోనే ఆగిపోయింది. దీనికి తోడు పలుచోట్ల తక్కువ విస్తీర్ణంలో ప్రభుత్వ స్థలాలు ఉన్నాయి.
ఆలయ అభివృద్ధి, భక్తుల వసతికి ఉపయోగం
శ్రీ సీతారామ చంద్రస్వామివారి ఆలయానికి నిత్యం భక్తులు వస్తుండగా, ముక్కోటి, శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు, ఇతర ముఖ్యమైన పర్వదినాల్లో భక్తుల రద్దీ అధికంగా ఉంటోంది. భద్రాచలం టూరిజంకు కేంద్రంగా మారుతున్న నేపథ్యంలో ఆలయ పరిసరాల్లో వసతి గృహాలు, భక్తుల విశ్రాంతి కేంద్రాలు, పార్కింగ్ స్థలాలు, ఇతర మౌలిక సదుపాయాలకు ప్రభుత్వ స్థలాలు ఉపయోగపడే అవకాశం ఉంది. రెవెన్యూ, దేవాదాయ శాఖలతోపాటు ఇతర ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో పరిశీలన చేపట్టే విధంగా కలెక్టర్ దృష్టి సారించాలని డివిజన్ ప్రజలు, భక్తులు కోరుతున్నారు.
ఏఐ చిత్రం


