సూపర్‌బజార్(కొత్తగూడెం): లక్ష్మీదేవిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎదురుగడ్డ గ్రామానికి చెందిన మేడి అఖిల్ హత్య కేసులో పోలీసులు మరో ముగ్గు రు నిందితులను అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఇప్పటికే నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన విష యం విదితమే. దర్యాప్తు కొనసాగిస్తున్న పోలీసులు హత్య కేసులో ప్రమేయం ఉన్న ఎదురుగడ్డ గ్రామానికి చెందిన సురేష్, పవన్, వినోద్‌లను మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. కోర్టులో హాజరుపరచగా, న్యాయమూర్తి రిమాండ్ విధించారని కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ తెలిపా రు. నిందితుల నుంచి మూడు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. చుంచుపల్లి సీఐ వెంకటేశ్వర్లు, లక్ష్మీదేవిపల్లి ఎస్సై అఖిల, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
రుణం పేరుతో టోకరా..
బాధితుడి ఆత్మహత్యాయత్నం
సూర్యాపేట టౌన్: ఇంటి నిర్మాణం కోసం రుణం ఇప్పిస్తానని నమ్మించి.. డాక్యుమెంట్లు, ఖాళీ చెక్కులు తీసుకున్న వ్యక్తి నగదు కాజేయడంతో మనస్తాపానికి గురైన బాధితుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. పోలీసులు మంగళవారం తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెంకు చెందిన బానోత్ రంగా కొత్తగా ఇల్లు నిర్మించుకోవాలని భావించాడు. ఈ విషయం తెలిసి సూర్యాపేటలోని అయ్యప్ప ఏజెన్సీకి చెందిన మురళి ఆయనను సంప్రదించి రుణం ఇప్పిస్తానని నమ్మించాడు. ఈక్రమాన ఇంటికి సంబంధించిన డాక్యుమెంట్లతో పాటు రూ.3 వేల నగదు, సంతకం చేసిన ఖాళీ చెక్కులను రంగా నుంచి మురళి తీసుకున్నాడు. అయితే, మూడు నెలల క్రితం రంగా బాబాయి బ్యాంకు ఖాతా నుంచి కొంత డబ్బు డెబిట్ అయింది. ఆ ఖాళీ చెక్కును ఉపయోగించి నిందితుడు రూ.48 వేలు డ్రా చేసినట్లు బయటపడింది. ఈ విషయమై సోమవారం సూర్యాపేటలోని మురళి కార్యాలయానికి రంగా వెళ్లి మాట్లాడగా తనకేమీ తెలియదని నిర్లక్ష్యంగా సమాధానమివ్వడంతో పాటు రంగాను దుర్భాషలాడాడు. దీంతో మనస్తాపానికి గురైన ఆయన పురుగుల మందు తాగడంతో స్థానికులు 108లో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై బాధితుడి ఫిర్యాదుతో మంగళవారం కేసు నమోదు చేసినట్లు పట్టణ సీఐ వెంకటయ్య తెలిపారు.


