భద్రాచలం: రామాలయంలో ఖాళీ పోస్టుల భర్తీలో అక్రమాలు జరిగాయంటూ డోలు విద్వాంసుడు మంగళవారం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థాన ఈఓ దామోదర్‌రావుకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదులోని వివరాల ప్రకారం.. ఇటీవల దేవస్థానం ఆధ్వర్యంలో ఖాళీగా ఉన్న వైదిక పోస్టులతోపాటు డోలు, మృదంగ విద్వాంసుల పోస్టులకు సిబ్బందిని నియమించారు. అయితే డోలు వాయిద్యకారుడి పోస్టు భర్తీలో అక్రమాలు జరిగాయంటూ ఆ పోస్టులో ఇప్పటివరకు కాంట్రాక్ట్ పద్ధతిన పని చేసిన వీరబాబు ఆరోపిస్తున్నారు. తెలంగాణ నివాసులతో మాత్రమే భర్తీ చేయాల్సి ఉండగా, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారిచే భర్తీ చేశారంటూ ఆరోపణలు చేస్తున్నారు. రేషన్ కార్డు, ఇతర ధ్రువీకరణ పత్రాల ఆధారాలు పరిశీలించాలని ఈఓను కోరారు. కాగా దీనిపై ఆలయ ఈఓ దామోదర్‌రావును వివరణ కోరగా.. నిబంధనల ప్రకారమే పోస్టుల భర్తీ జరిగిందని తెలిపారు. అయినా ఫిర్యాదును పరిశీలించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని పేర్కొన్నారు.


