అర్బన్ పార్క్‌లో ప్లాంటేషన్ ఏర్పాటుకు శ్రీకారం
ఆధునిక పద్ధతిలో చెట్ల పెంపకానికి అటవీశాఖ కసరత్తు
30 ఏళ్లలోపే దట్టమైన అడవి పెరిగేలా చర్యలు
సేంద్రియ ఎరువులతో..
పాల్వంచరూరల్: సాధారణంగా అడవి దట్టంగా పెరగడానికి వంద నుంచి రెండు వందల ఏళ్లు పడుతుంది. అదే మియావాకీ పద్ధతిలో 20 నుంచి 30 ఏళ్లలోనే అడవి పెరుగుతుంది. ఆ పద్ధతిలో ప్లాంటేషన్ పెంచేందుకు పాల్వంచలోని అర్బన్‌పార్క్‌లో అటవీశాఖ అధికారులు శ్రీకారం చుట్టారు. మండలంలోని బస్వతారాకకాలనీ గ్రామపంచాయతీలో సోములగూడెం వెళ్లే మార్గంలో అటవీశాఖ అర్బన్ పార్క్ ఏర్పాటు చేసింది. పార్కుకు ఆదరణ లేకపోవడంతో ప్రజలను ఆకట్టుకునేందుకు పలు రకాల ప్రయోగాలను చేపడుతోంది. నాలుగేళ్ల క్రితం వంద హెక్టార్ల విస్తీర్ణంలో అర్బన్ పార్క్ ఏర్పాటు చేశారు. వాకింగ్ పాత్, చిన్నారుల కోసం చిల్డ్రన్ జోన్, ఓపెన్ జిమ్, రచ్చబండలు వంటి ఏర్పాటు చేశారు. తాజాగా మియావాకీ ప్లాంటేషన్ ఏర్పాటు చేస్తున్నారు.
ఉపాధి కూలీలతో..
మియావాకీ ప్లాంటేషన్ ఏర్పాటుకు ఉపాధి కూలీలతో పనులు చేయిస్తున్నారు. మొక్కలు నాటేందుకు గోతులు తీయడం, స్థలాన్ని శుభ్రం చేయడం, కోసం 20 నుంచి 30మంది కూలీలను వినియోగిస్తున్నారు. వీరికి రోజుకు రూ.308 చొప్పున చొప్పున కూలి చెల్లిస్తున్నారు.
తక్కువ స్థలంలో.. తక్కువ సమయంలో..
మియావాకీ ప్లాంటేషన్.. తక్కువ స్థలంలో.. తక్కు వ సమయంలో దట్టమైన కృత్రిమ అడవులను పెంచే ఆధునిక జపనీస్ వృక్షశాస్త్ర పద్ధతి. జపాన్‌కు చెందిన ప్రసిద్ధ వృక్ష శాస్త్రవేత్త డాక్టర్ అకీరా మియావాకీ ఈ విధానాన్ని కనుగొనడంతో, దీనికి మియావాకీ పద్ధతి అనే పేరొచ్చింది. నగరాల్లో ఖాళీ స్థలాలు, తక్కువ విస్తీర్ణంలో దట్టమైన చెట్లు పెంచేందుకు ఈ పద్ధతి ఉపయోగిస్తున్నారు. ఆయా ప్రాంతాల వాతావరణం, నేల స్వభావానికి సరిపోయే స్థానిక జాతుల మొక్కలు వేప, రావి, మర్రి, చింత వంటివి మాత్రమే ఎంచుకుంటారు. తోటల వలే కాకుండా చదరపు మీటరు స్థలంలో 3 నుంచి 5 మొక్కలను చాలా దగ్గరగా నాటుతారు. చిన్న పొదలు, మధ్యస్తంగా పెరిగే చెట్లు, బాగా ఎత్తుగా పెరిగే వృక్షాలను కలిపి ఒకే వరుసలో నాటుతారు. రెండు, మూడు దశాబ్దాల్లోనే అడవి దట్టంగా పెరుగుతుందని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు.
హైదరాబాద్‌లో ఇలాగే...
రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే మియావాకీ పద్ధతిలో అడవులు పెంచినట్లు అటవీశాఖ అధికా రులు చెబుతున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద మానవ నిర్మిత మియావాకీ అడవుల్లో ఒకటిగా హైదరాబాద్‌లోని శంషాబాద్ పేరొందిందని పేర్కొంటున్నారు. కేబీఆర్ నేషనల్ పార్క్, నక్లెస్ రోడ్డులో గ్రీన్ కారిడార్, గాజులరామారం, సెంట్రల్ యూనివర్సిటీలో, కరీంనగర్ జిల్లాలోని రాంపూర్, అలకాపురి ప్రాంతంలో, రామగుండం ప్రాంతాల్లో కూడా మియావాకీ పద్ధతిలో అడవులు పెంచినట్లు అటవీ శాఖ వెల్లడిస్తోంది.
అర్బన్ పార్క్‌లో హెక్టార్ స్థలంలో పదివేల మొక్కలను నాటి మియావాకీ ప్లాంటేషన్ ఏర్పాటు చేస్తున్నాం. ఉపాధి కూలీల ద్వారా పనులు నిర్వహిస్తున్నాం. మొక్కలు నాటడానికి ముందే నేలను తవ్వి అందులో కొబ్బరి పొట్టు, ఊక, పశువుల ఎరువు వంటి సేంద్రియ పదార్థాలను కలిపి భూమిని సారవంతంగా మార్చేందుకు చర్యలు చేపడుతున్నాం.
–క్రాంతి, పాల్వంచ రేంజ్ డీఆర్‌ఓ


