నిర్మాణాల తొలగింపుతో బయటపడిన కొండ
భద్రాచలం: ఏళ్లుగా ఆలయ నిర్మాణాల వెనుక మరుగునపడిపోయిన భద్రుడి గిరి మళ్లీ బయటపడింది! భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం అభివృద్ధి, విస్తరణ పనుల్లో భాగంగా పాత కట్టడాలను తొలగించారు. దీంతో కొండ కనిపిస్తోంది. భద్రాచల క్షేత్రానికి భద్రుని గిరే మూలాధారం. స్థలపురాణం ప్రకారం.. భద్రుడు చేసిన తపస్సుకు మెచ్చిన శ్రీరాముడు వైకుంఠం నుంచి ప్రత్యక్షమై ఆయనకు మోక్షాన్ని ప్రసాదించాడట. భద్రుడి గిరిగా మారడంతో ఆ ప్రాంతం భద్రగిరిగా ప్రసిద్ధి చెందిందని ప్రతీతి. సీతాలక్ష్మణ సమేతుడైన శ్రీరామచంద్రుడు ఈ భద్రగిరిపైనే కొలువుదీరాడని భక్తుల విశ్వాసం. కాలక్రమేణా ఆలయ అభివృద్ధి కోసం కొండ చుట్టూ నిర్మాణాలు పెరిగి గిరి కనిపించకుండా పోయింది. ఇప్పుడు అభివృద్ధి పనుల్లో భాగంగా కట్టడాలను తొలగించడంతో గిరి స్వరూపం మళ్లీ వెలుగులోకి వచ్చింది.


