అదరగొట్టిన చిన్నారులు ! | - | Sakshi
Sakshi News home page

అదరగొట్టిన చిన్నారులు !

Oct 30 2026 12:39 AM | Updated on Oct 30 2026 12:39 AM

ఖమ్మంసహకారనగర్‌: చట్టసభల్లో అధికార, ప్రతిపక్ష సభ్యులు వ్యవహరించే తీరుతో హావభావాలు, వాగ్దాటితో విద్యార్థులు ఆకట్టుకున్నారు. ప్రధానమంత్రి, స్పీకర్‌, డిప్యూటీ స్పీకర్‌, మంత్రులు, ప్రతిపక్ష నేతలకు తోడు మార్షల్స్‌గా విద్యార్థులు వ్యవహరించిన మాక్‌ పార్లమెంట్‌ను ఖమ్మంలోని జిల్లా పరిషత్‌ సమావేశ హాల్‌లో గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీఈఓ డి.వాసంతి మాట్లాడుతూ ప్రతీ పాఠశాలలో మాక్‌ పార్లమెంట్‌ కార్యక్రమం ఏటా రెండు, మూడు సార్లు నిర్వహించాలని సూచించారు. తద్వారా విద్యార్థులకు చట్టసభలపై అవగాహన పెరుగుతుందని తెలిపారు. అలాగే, జిల్లా పరిషత్‌ సీఈఓ దీక్షారైనా కూడా కార్యక్రమాన్ని పరిశీలించి విద్యార్థులను అభినందించారు.

26 పాఠశాలల విద్యార్థులతో..

ఖమ్మం జిల్లాలోని 26 పీఎంశ్రీ ఉన్నత పాఠశాలల విద్యార్థులతో సోషల్‌ ఫోరం ఉపాధ్యాయుల సమన్వయంతో మాక్‌ పార్లమెంట్‌ నిర్వహించారు. దాదాపు రెండున్నర గంటల పాటు సాగిన కార్యక్రమంలో తొలుత రాష్ట్రపతి ప్రసంగం, ఆ తర్వాత రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం, ఆ తీర్మానంపై చర్చ ఇలా అచ్చం పార్లమెంట్‌లో మాదిరి కార్యక్రమం ఆసక్తిగా కొనసాగింది. తీర్మానానికి అధికార పక్షం అనుకూలంగా ప్రసంగించడం, ప్రతిపక్ష నేతలు విమర్శించడాన్ని కళ్లకు కట్టినట్టు ప్రదర్శించారు. పార్లమెంట్‌లో చర్చలు ఎలా జరుగుతాయని, ఏయే పదవులు ఉంటాయో వివరిస్తూ మాక్‌ పార్లమెంట్‌ నిర్వహించగా, అకడమిక్‌ మానిటరింగ్‌ అధికారి పి.ప్రభాకర్‌రెడ్డితో పాటు సోషల్‌ ఫోరం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బాలానందం, శ్రీనివాసరావు, సుబ్బారావు, భీమరాజు, ఎఫ్‌ఎల్‌ఎన్‌ సెల్‌ సభ్యులు శ్యామ్‌లాల్‌, ప్రవీణ్‌, శ్రావణ్‌, సేవ్యా తదితరులు పాల్గొన్నారు.

ఉత్సాహంగా మాక్‌ పార్లమెంట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement