భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో బుధవారం రామయ్య కల్యాణం కమనీయంగా జరిగింది. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి మిథిలా స్టేడియంలోని రామ సేవా మండపంలో స్వామి వారిని కొలువుదీర్చారు. నిత్యకల్యాణ మూర్తులకు విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా జరిపారు.
రామయ్య సన్నిధిలో ఎమ్మెల్సీ
శ్రీ సీతారామ చంద్రస్వామివారిని మెదక్ ఎమ్మెల్సీ అంజిరెడ్డి బుధవారం దర్శించుకున్నారు. ఆలయ ప్రదక్షిణ అనంతరం మూలమూర్తులకు ప్రత్యేక పూజలు చేశారు. పండితులు వేదాశీర్వచనం చేసి స్వామివారి జ్ఞాపికను అందజేశారు.
రామయ్య సేవలో...
శ్రీ సీతారామ చంద్రస్వామివారిని రాష్ట్ర సాంకేతిక, కళాశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన బుధవారం దర్శించుకున్నారు. ఆలయ ప్రదక్షిణ అనంతరం అంతరాలయంలో మూలమూర్తులకు ప్రత్యేక పూజలు చేశారు. పండితులు ఆమెకు వేదాశీర్వచనం చేసి ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రవికుమార్, ఆలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
నిత్యాన్నదానానికి రూ.లక్ష విరాళం
పాల్వంచరూరల్: రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జన్మదినం సందర్భంగా కాంగ్రెస్ నాయకులు, కార్పొరేటర్లు బుధవారం శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి) ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. 6వ డివిజన్ కార్పొరేటర్ బీఎస్ రావు భక్తుల నిత్య అన్నదానానికి రూ.లక్ష విరాళం అందజేశారు. పెద్దమ్మగుడి మాజీ డైరెక్టర్ చందుపట్ల శ్రీనివాసరెడ్డి అన్నదానం చేశారు. నాయకులు నాగేశ్వరరావు, శివారెడ్డి, ఎం.కిరణ్, సధా పాల్గొన్నారు.


