● ఈదురుగాలులకు నేలవాలిన వరి పొలాలు ● తుపాన్‌తో మినుము, వరి, పత్తి పంటలకు నష్టం
అశ్వారావుపేటరూరల్/దుమ్ముగూడెం/బూర్గంపాడు: అర్నబ్ తుపాన్‌తో రైతులకు తీరని నష్టం వాటిల్లింది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో తుపాన్ ప్రభావం చూపింది. వరి, పత్తి పంటలు దెబ్బతిన్నాయి. జిల్లా వ్యాప్తంగా ఈదురు గాలులు వీయడంతోపాటు చిరు జల్లులు కురుస్తున్నాయి. మంగళవారం రాత్రి నుంచి బుధవారం రాత్రి వరకు తేలికపాటి జల్లులు కురిశాయి. వర్షానికి వరికోతలు, పత్తితీత పనులు నిలిచిపోయాయి. భారీ వర్షాల హెచ్చరికలతో ఆందోళనకు గురైన రైతులు తేలికపాటి జల్లులు పడుతుండటంతో ఒకింత ఊరట చెందారు. మరో రెండురోజుల పాటు వర్షాలు కురుస్తాయనే హెచ్చరికల నేపథ్యంలో చేలలో పూసిన పత్తి పాడవుతుందనే ఆందోళన రైతులను వీడటం లేదు.
దెబ్బతిన్న పంటలు
అశ్వారావుపేట మండలంలోని నారాయణపురం, గుమ్మడవల్లి, ఊట్లపల్లి, కేశప్పగూడెం, వినాయకపురం, రామన్నగూడెం, జమ్మిగూడెం తదితర గ్రామాల్లో 400 ఎకరాల్లో వరిపంట నేలవాలింది. మరో 150 ఎకరాల్లో పత్తి పంట దెబ్బతిన్నది. ఈ ఏడాది మండలంలోని గాండ్లగూడెం, అనంతారం, బచ్చువారిగూడెం, పండువారిగూడెం, మల్లాయిగూడెం, గుమ్మడవల్లి, కోయ రంగాపురం, కొత్తూరు, నందిపాడు ప్రాంతాల్లో అత్యధికంగా మినుము పంటను సాగు చేశారు. ఎడతెరిపిలేకుండా కురిసిన భారీ వర్షం, తుపాను కారణంగా దాదాపు 200 ఎకరాల్లో మినుము పంట దెబ్బతిన్నగా, పనలు మొలకెత్తుతున్నాయి. గాండ్లగూడేనికి చెందిన భూక్యా కనక అనే రైతుకు చెందిన 15 ఎకరాల మినుము పంట దెబ్బతినడంతో క్వింటాకు రూ.12వేల చొప్పున నష్టం వాటిల్లిందని అవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఇక దుమ్ముగూడెం మండలం సున్నంబట్టి దగ్గర గోదావరి అలలకు మత్స్యకారులు ఒడ్డున నిలిపిన పడవలు నీట మునిగాయి. దుమ్ముగూడెం ఆనకట్టపై నీటి నిల్వల కోసం చేపట్టిన ఇసుక బస్తాల పేర్చే పని నిలిచిపోయింది.


