భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో శ్రీదేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఆధ్యాత్మిక వైభవంతో కొనసాగుతున్నాయి. మహా లక్ష్మి అమ్మవారు వీరలక్ష్మిగా భక్తులకు దర్శనమిచ్చా రు. భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. కాగా, మంగళవారం అమ్మవారు నిజరూప మహాలక్ష్మి అలంకరణలో భక్తులకు దర్శనమివ్వనున్నారు.
విజయదశమి వేడుకలకు ఏర్పాట్లు
వైష్ణవ సంప్రదాయం ప్రకారం భద్రాచలం దేవస్థానంలో బుధవారం నిర్వహించే దసరా వేడుకలకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయ అభివృద్ధి నేపథ్యంలో ఈ ఏడాది విజయదశమి ఉత్సవాలను ఆలయ ప్రాంగణంలోనే నిర్వహించనున్నారు. స్వామివారిని తిరువీధి సేవకు తీసుకువెళ్లే పరిస్థితులు లేకపోవడంతో జమ్మి కొమ్మను ఆలయానికి తీసుకువచ్చి శమీ పూజ, ఆయుధ పూజ నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. ఉదయం స్వామివారికి పట్టాభిషేకం, కల్యాణ మహోత్సవాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సాయంత్రం స్వామివారి పాదుకలు, రామజ్యోతిని వేదమంత్రోచ్ఛరణలు, మంగళవాయిద్యాల నడు మ సంప్రదాయబద్ధంగా రామదాసు మండపానికి ఊరేగింపుగా తీసుకువెళ్లనున్నారు. అక్కడ శ్రీరామ్‌లీలా మహోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.


