భద్రాచలంఅర్బన్: ఏపీలోని గుంటూరు ఆర్‌టీసీ కాలనీకి చెందిన దుర్గారావు ‘రామ్ ది ట్రావెలర్’ (శ్రీరాముడు) పేరుతో ప్రపంచ యాత్ర చేస్తున్నాడు. ఎనిమిదో తరగతితో చదువు ఆగిపోయిన దుర్గారావు 2023లో ప్రయాణాలు మొదలుపెట్టాడు. ఇప్పటివరకు 30 దేశాల్లో పర్యటించిన ఆయన, అందులో 11 దేశాలను సైకిల్‌పై చుట్టిరావడం విశేషం. ప్రపంచంలోని 195 దేశాలను చూడాలని లక్ష్యంగా పెట్టుకోగా విజయవాడ నుంచి సైకిల్‌పై సోమవారం భద్రాచలం చేరుకున్నాడు. వివిధ దేశాల జీవన విధానం, ప్రజల ఆహారపు అలవాట్లు, సంస్కృతి, సంప్రదాయాలు తెలుసుకునేందుకే పర్యటనలు చేస్తున్నానని తెలిపాడు. గతేడాది నేపాల్‌లోని పర్వత ప్రాంతాల్లో ప్రయాణిస్తున్న సమయంలో తన మోకాలికి గాయం కాగా, ఆతర్వాత కూడా పలు దేశాల్లో పర్యటించానని వెల్లడించాడు. సోషల్ మీడియాలో ఎంతో ఆదరణ లభిస్తుందని తెలిపాడు.
దుర్గాభవాని ఆలయంలో చండీయాగం
ఇల్లెందు: ఇల్లెందు ఏరియా జేకే–5 ఓసీ శ్రీ దుర్గా భవానీ మాత ఆలయంలో సోమవారం చండీయాగం నిర్వహించారు. జీఎం వీసం కృష్ణయ్య ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఓటూ జీఎం జాకీర్ హుస్సేన్, కేఓసీ పీఓ మాధవరావు, డీజీఎం ఐఈడీ ప్రభాకర్‌రావు, ఏరియా సేఫ్టీ ఆఫీసర్ రాందాస్, ఇతర అధికారులు, కార్మికులు పాల్గొన్నారు.
పాత కక్షలతో యువకుడి హత్య
సూపర్‌బజార్(కొత్తగూడెం): పాత కక్షలతో ఓ యువకుడిని సోమవారం హతమార్చారు. పోలీసుల కథనం ప్రకారం.. ఖమ్మంలో డిగ్రీ చదువుతున్న లక్ష్మీదేవిపల్లి మండలం ఎదురుగడ్డకు చెందిన మేడి అఖిల్(20) దసరా సెలవులకు ఇంటికి వచ్చాడు. ఆదివారం అర్ధరాత్రి బతుకమ్మ వేడుకల్లో పాల్గొని తిరిగి వస్తుండగా కొందరు యువకులు మద్యం తాగేందుకు సమీప రైల్వే ట్రాక్ వద్దకు తీసుకెళ్లారు. తాగిన తరువాత బండరాయితో ముఖంపై కొట్టి, కత్తులతో పొడిచి హత్యచేశారు. సోమవారం తెల్లవారుజామున సమాచారం అందుకున్న లక్ష్మీదేవిపల్లి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. కొంతకాలం క్రితం జరిగిన గొడవను దృష్టిలో ఉంచుకుని పథకం ప్రకారం హత్యకు పాల్పడినట్లు అఖిల్ తండ్రి మేడి పాపయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎస్‌ఐ అఖిల కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
యువకుడి ఆత్మహత్య
అశ్వారావుపేటరూరల్: కుటుంబ కలహాలతో తల్లిదండ్రులు కొంతకాలంగా విడిగా ఉంటున్నారనే మనోవేదనతో సోమవారం తనయుడు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అదనపు ఎస్‌ఐ దేవ్‌సింగ్ కథనం ప్రకారం.. అశ్వారావుపేట మున్సిపాలిటీ పరిధిలోని నెహ్రునగర్‌కు చెందిన కాగిత నాగ ముత్యాలరావు–జ్యోతి దంపతుల తనయుడు రంజిత్(19) బైక్ షోరూంలో మెకానిక్‌గా పని చేస్తున్నాడు. తల్లిదండ్రులు రెండేళ్లుగా వేర్వేరుగా ఉండటంతో రంజిత్ అమ్మమ్మ ఇంట్లోనే ఉంటున్నాడు. మనోవేదనతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
బతుకమ్మ పూల కోసం వెళ్లి..
చెరువులో మునిగి వ్యక్తి మృతి
అశ్వాపురం: బతుకమ్మ కోసం తామర పూలు సేకరించేందుకు వెళ్లిన ఓ వ్యక్తి చెరువులో మునిగి మృతి చెందాడు. మండల కేంద్రంలోని కాలువ బజార్ కు చెందిన కుర్సం లక్ష్మయ్య(57) ఆదివారం మధ్యాహ్నం భద్రయ్య గారి కుంట వద్దకు తామర పూలు సేకరించేందుకు వెళ్లాడు. ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు, బంధువులు చెరువు పరిసరాల్లో వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో సోమవారం ఉదయం చెరువులో గాలించారు. నీటిలోని చెట్ల తీగల మధ్య మృతదేహం చిక్కుకుని ఉండగా, బయటకు తీశారు. లక్ష్మయ్య మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మణుగూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
గుండెపోటుతో ఎస్‌బీఐ క్యాషియర్ మృతి
గార్ల: మహబూబాబాద్ జిల్లా గార్ల ఎస్‌బీఐలో క్యాషియర్‌గా విధులు నిర్వర్తిస్తున్న యాస అశోక్(35) సోమవారం గుండెపోటుతో మృతిచెందాడు. బ్యాంకులో విధులు నిర్వర్తిస్తున్న క్రమంలోనే గుండెపోటుకు గురై ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో సహచర ఉద్యోగులు సీహెచ్‌సీకి తరలించి చికిత్స చేయించినా ఫలితం దక్కలేదు. అశోక్ స్వస్థలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం తూరుబాక కాగా, ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
బోనస్ జాప్యంపై
జీఎం ఆఫీసు ముట్టడి
ఇల్లెందు: దసరా బోనస్ చెల్లింపులో యాజమాన్యం ద్వంద్వ వైఖరి అవలంబిస్తూ కాంట్రాక్టు కార్మికులను మోసం చేస్తోందని ఆరోపిస్తూ టీయూసీఐ ఆధ్వర్యంలో సోమవారం సింగరేణి జీఎం కార్యాలయాన్ని ముట్టడించారు. డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అధికారులకు అందజేశారు. యాకూబ్‌షావలీ మాట్లాడుతూ రెగ్యులర్ కార్మికులకు ప్రకటించిన వెంటనే బోనస్ చెల్లించిన యాజమాన్యం కాంట్రాక్టు కార్మికులకు చెల్లించకుండా నిర్లక్ష్యం చేస్తోందన్నారు. కార్మిక నేతలతో చర్చించిన జీఎం కృష్ణయ్య తక్షణమే కార్మికుల అకౌంట్లలో బోనస్ జమ అవుతుందని చెప్పారు. రాంసింగ్, పాయం వెంకన్న, గురునాథం, చిలకమ్మ, రాధ, స్వాతి పాల్గొన్నారు.
సోమవారం రాత్రి జమ
రుద్రంపూర్: సంస్థవ్యాప్తంగా 12 వేల మంది కాంట్రాక్ట్ కార్మికులకు సోమవారం రాత్రి లాభాల వాటా చెల్లించినట్లు సింగరేణి అధికారులు తెలిపారు. మిగిలిన కార్మికులకు కూడా త్వరలోనే చెల్లిస్తామని పేర్కొన్నారు.


