విస్తృత ప్రచారం
నవంబర్ 6 వరకు ఫారం–18 స్వీకరణ
గత ఎన్నికలతో పోల్చితే
ఈసారి పెరగనున్న ఓటర్లు
అర్హులపై ఆశావహులు నజర్
ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఎన్నికకు సంబంధించి తొలి అంకం మొదలైంది. ఓటరు నమోదు షెడ్యూల్ విడుదల కాగా, నవంబర్ 6వ తేదీ వరకు ఫారం –18 ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశముంది. దరఖాస్తుల ద్వారా ఓటు నమోదుకు అవకాశం ఇచ్చింది. ఈ నియోజకవర్గ ఎమ్మెల్సీ పదవీ కాలం వచ్చే ఏడాది మార్చితో ముగియనుండడంతో ఎన్నికకు ఏర్పాట్లు ప్రారంభించారు.
– సాక్షి ప్రతినిధి, ఖమ్మం
మేమున్నాం..
పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఓటరు నమోదు షెడ్యూల్ రావడంతో ఆశావహులు ఆ దిశగా దృష్టి సారించారు. పట్టభద్రులతో దరఖాస్తు చేయించేందుకు మండలాలు, జిల్లాల వారీగా ఏజెంట్లను నియమించారు. ఎవరు అర్హులు, ఏమేం పత్రాలు కావాలి, ఎలా దరఖాస్తు చేసుకోవాలో సూచిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టిస్తున్నారు. ఇవేమీ కాకపోతే ‘వివరాలన్నీ మాకు పంపితే.. మేమే దరఖాస్తు చేసి రశీదు వాట్సాప్‌కి పంపుతాము..’ అంటూ మెసేజ్‌లు పంపిస్తున్నారు. ఈ దరఖాస్తు ప్రక్రియ పర్యవేక్షణకు రిటైర్డ్ ఉద్యోగులను నియమించిన ఆశావహులు.. వేతనం ఇచ్చేలా ఒప్పందాలు చేసుకోవడం గమనార్హం.
మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిందే..
గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో గతంలో ఓటు వేసిన వారైనా మళ్లీ ఈసారి దరఖాస్తు చేసుకోవాలి. ఈ ఏడాది నవంబర్ 1 నాటికి డిగ్రీ లేదా తత్సమానమైన డిప్లొమా పూర్తిచేసి మూడేళ్లు నిండిన వారు ఓటరు నమోదుకు అర్హులు. ఈమేరకు ఖమ్మం కలెక్టరేట్‌కు 1.10లక్షలు, భద్రాద్రి కలెక్టరేట్‌కు 60 వేల దరఖాస్తులు వచ్చాయి. వీటిని కలెక్టరేట్లతో పాటు ఈఆర్వో, ఏఈఆర్వో కార్యాలయాల వద్ద అందుబాటులో పెడతారు. నేరుగా దరఖాస్తు చేసుకోవడంతో పాటు పోస్టు ద్వారా పంపించే వీలు ఉండగా, ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే అవకాశముంది.
పది శాతం పెరగొచ్చు..
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గతంలో ఎమ్మెల్సీ స్థానా నికి 1,23,985 మంది ఓటర్లు ఉన్నారు. ఈసారి దరఖాస్తుకు ఎన్నికల సంఘం 40 రోజుల సమయం ఇచ్చింది. ఈ సారి ఓటర్ల సంఖ్య కనీసం పది శాతం పెరిగే అవకాశముందని భావిస్తున్నారు.
ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న ఆశావహులు ఎక్కువ మంది పట్టభద్రులతో ఓటరుగా నమోదు చేయించడంపై దృష్టి సారించారు. విద్యా సంస్థలు, గ్రంథాలయాలు, ప్రభుత్వ కార్యాలయాలు, కోచింగ్ సెంటర్ల వద్దకు వెళ్లి అవగాహన కల్పిస్తున్నారు. ఎవరు అర్హులు, ఏయే సర్టిఫికెట్లు జత చేయాలి, దరఖాస్తు ఎలా చేసుకోవాలో వివరిస్తున్నారు. తొలుత అధిక సంఖ్యలో ఓట్లు నమోదు చేయిస్తే, ఆతర్వాత ఎన్నికలపై ప్రచారంలో దూసుకెళ్లొచ్చనే భావనలో ఉన్నారు..
రెవెన్యూ డివిజన్ పురుషులు మహిళలు ఇతరులు మొత్తం
ఖమ్మం 39,788 26,743 03 66,534
కల్లూరు 10,888 6,456 01 17,345
కొత్తగూడెం 15,738 12,365 – 28,103
భద్రాచలం 6,852 5,151 – 12,003
మొత్తం 73,266 50,715 04 1,23,985
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటు నమోదుకు షెడ్యూల్


