● సరిపడా కుర్చీలు లేక ఇబ్బందులు ● దరఖాస్తులు స్వీకరించిన కలెక్టర్ అంకిత్
సూపర్‌బజార్(కొత్తగూడెం): ప్రజాసమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్‌లో ప్రతీ సోమవారం నిర్వహించే ప్రజావాణికి ఈసారి జనం పోటెత్తారు. గత రెండు వారాలు ప్రజావాణి జరకపోవడంతో ఈసారి రద్దీ పెరిగింది. అయితే, గతంలో మాదిరి బయట కుర్చీలు ఎక్కువగా ఏర్పాటు చేయకపోవడం, ఆవరణలో కూర్చుంటే సిబ్బంది బయటకు పంపించడంతో ప్రజలు ఇబ్బంది పడ్డారు.
కలెక్టర్ వచ్చాక క్యూ...
ఉదయం 10–30 గంటలకు జిల్లా ఉపాధి కల్పన శాఖాధికారి, హౌజింగ్ పీడీ దరఖాస్తుల స్వీకరణ మొదలుపెట్టారు. అయినా జనం ఆసక్తి చూపకపోగా కలెక్టర్ అంకిత్, అదనపు కలెక్టర్ వేణుగోపాల్ వచ్చాక దరఖాస్తుదారులు క్యూకట్టారు. ఈమేరకు ఫిర్యాదులు, వినతిపత్రాలను స్వీకరించిన కలెక్టర్.. వాటి పరిష్కారానికి అధికారులకు సూచనలు చేశారు.
విద్యార్థులకు నాణ్యమైన బోధన
చుంచుపల్లి: విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించడంతోపాటు ప్రజలకు సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. చుంచుపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల, పాత కొత్తగూడెం పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సోమవారం ఆయన తనిఖీ చేశారు. తొలుత పాఠశాలలో ఉపాధ్యాయుల హాజరు, బోధన, పరిశుభ్రతను పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడి బోధన స్థాయిపై ఆరాతీశారు. పదో తరగతి గదిలో ఉపాధ్యాయుడు లేకపోవడంపై సరైన సమాధానం రాకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈమేరకు హెచ్‌ఎం రవికి షోకాజ్ నోటీసు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థుల చదువుకు ఆటంకం లేకుండా చేస్తూ పదో తరగతిలో ఉత్తమ ఫలితాల సాధనకు ఇప్పటి నుంచే దృష్టి సారించాలని తెలిపారు. అనంతరం పాత కొత్తగూడెం పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ రోజువారీ ఓపీ, మందుల లభ్యతను పరిశీలించాక మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. తహసీల్దార్ నాగరాజు, ఎంఈఓ నీరజ, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.
విద్యాసంస్థల్లో నాణ్యమైన వసతులు
సూపర్‌బజార్(కొత్తగూడెం): అన్ని శాఖల పరిధిలోని రెసిడెన్షియల్ విద్యాసంస్థల్లో విద్యార్థులకు నాణ్యమైన వసతులు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆదేశించారు. హైదరాబాద్ నుంచి సోమవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా, జిల్లా నుంచి కలెక్టర్ అంకిత్, అదనపు కలెక్టర్ వేణుగోపాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని రెసిడెన్షియల్ విద్యాసంస్థల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతులు, నాణ్యమైన ఆహారం అందిస్తున్నామని, ఆరోగ్యం, ఆహారం, హాజరుపై నిరంతరం పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. దసరా నాటికి రెండేసి జతల కుట్టిన యూనిఫాం అందిస్తామని తెలిపారు.


