ఖమ్మంగాంధీచౌక్: గణపతి ఉత్సవాలంటే భక్తి, ఉత్సాహమే కాదు.. సేవను భాగం చేసిన శుక్రవారంపేట గణేష్ ఉత్సవ కమిటీ ఆదర్శంగా నిలుస్తోంది. ఖమ్మంలోని సీనియర్ కమిటీల్లో ఒకటైన శుక్రవారంపేట కమిటీ 1980లో ప్రారంభమైంది. భూమా జగన్నాథం, వీరమల్ల శ్రీనివాసరెడ్డి స్థాపించగా.. వారు కాలం చేసినా వారసులుగా భూమా నవీన్ కుమార్, మధు, దేవిశెట్టి దామోదర్ తదితరులు కొనసాగిస్తున్నారు. ఈ కమిటీ ఆధ్వర్యాన గణేష్ ఉత్సవాలు నిర్వహించడమే కాక దివ్యాంగులకు అండగా నిలుస్తూ జైపూర్ కత్రిమ కాళ్లు, చేతులు అందిస్తున్నారు. కొందరు దివ్యాంగులకు ట్రై సైకిళ్లను పంపిణీ చేయడమేకాక ఏటా ప్రభుత్వ పాఠశాలల్లో 700 మంది పేద విద్యార్థులకు నోట్ బుక్స్, కంపాస్, పెన్నులు, పెన్సిళ్లతో కూడిన కిట్లు అందిస్తున్నారు. అలాగే, ఉత్సవాలు జరిగే డివిజన్‌లోని పారిశుద్ధ్య కార్మికులకు నెలకు సరిపడా సరుకులను అందజేస్తూ వారి శ్రమకు గౌరవం ఇస్తున్నారు. కొందరు పేద బ్రాహ్మణులకు కూడా నెలకు సరిపడా నిత్యావసరాలను అందిస్తూ సేవాగుణం చాటుకుంటున్నారు.


