● ధాన్యం తనిఖీలకు ‘రాండమైజేషన్’లో ఉద్యోగులు ● అక్కడికక్కడే వివరాలు యాప్‌లో నమోదు ● ఎక్కడా తేడా రాకుండా పారదర్శకత
ఖమ్మం సహకారనగర్: ఏటా ప్రభుత్వం కొనుగోలు చేసే ధాన్యాన్ని బియ్యం మార్చేందుకు కస్టమ్ మిల్లింగ్ రైస్ విధానంలో మిల్లులకు కేటాయిస్తున్నారు. అయితే, కొందరు మిల్లులు యాజమాన్యాలు ధాన్యాన్ని పక్కదారి పట్టిస్తుండగా, ఇంకొందరు సమయానికి బియ్యం అందించడం లేదు. దీంతో కొన్నాళ్లుగా మిల్లుల్లో తనిఖీలు చేపడుతున్నారు. కానీ తనిఖీ బృందాల్లో కొందరు ఉద్యోగులు మిల్లర్లతో మిలాఖత్ అయినట్లు బయటపడింది. దీంతో తనిఖీ బృందాల ఎంపిక కోసం కంప్యూటర్ ఆధారిత రాండమైజేషన్ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించారు.
ప్రతీ మంగళవారం సాయంత్రం ఎంపిక
ప్రతీ బుధవారం మిల్లుల్లో అధికారులు తనిఖీ చేయాల్సి ఉంటుంది. ఈమేరకు మంగళవారం సాయంత్రం ఆన్‌లైన్ రాండమైజేషన్‌లో అధికారులకు ఎంపిక చేసిన మిల్లులు కేటాయిస్తారు. ఆ మిల్లులో నిల్వలను తనిఖీ చేసి ఓపీఎంఎస్(ఆన్‌లైన్ ప్రొక్యూర్‌మెంట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్) యాప్‌లో వివరాలను నమో దు చేయాల్సి ఉంటుంది. ఏ బృందం ఏ మిల్లుల్లో తనిఖీకి వెళ్లనుందో గోప్యత పాటిస్తారు.
యాప్‌లో వివరాలు...
జాబితాలో మిల్లుల వివరాలే కాక జిల్లా, మండలం, జీపీఎస్ కోఆర్డినేట్లు, కేటాయింపు స్థానం వంటి వివరాలు నమోదవుతాయి. బృందం మిల్లుకు చేరుకున్నాక నేతృత్వం వహించే అధికారి ఐడీ, పాస్‌వర్డ్‌తో ఓపీఎంఎస్ మిల్లర్ యాప్‌లో లాగిన్ కావాలి. అప్పటికే సదరు మిల్లుకు కేటాయించిన ధాన్యం, ఇప్పటివరకు తిరి గి ఇచ్చిన బియ్యం, తదితర వివరాలన్నీ ఉంటాయి. వీటి ఆధారంగా తనిఖీ చేపట్టి యాప్‌లో నమోదు చేస్తే, వ్యత్యాసం ఉంటే బయటపడుతుంది.
నమూనాల సేకరణ
తనిఖీల్లో భౌతిక నిల్వలను నిర్ధారించేందుకు ధాన్యం కుప్ప చుట్టూ ఐదు ప్రాంతాల నుంచి నమూనాలు సేకరించే విధానం అనుసరిస్తారు. ముందు, కుడి, వెనుక, ఎడమ, మధ్య ప్రాంతాల నుంచి నమూనాలు సేకరిస్తారు. అవసరమైన చోట బస్తాలు లెక్కిస్తారు. అంతేకాక తనిఖీ సమయాన జీపీఎస్ కోఆర్డినేట్లతో కూడిన ఫొటో తీసి, నివేదికపై వాంగ్మూలం తీసుకుని యాప్‌లో నమోదు చేయనుండడంతో అక్రమాలకు పాల్పడే అవకాశముండదని భావిస్తున్నారు. ఇందులోనూ తప్పుడు నివేదిక ఇచ్చినట్లు తేలితే బాధ్యులపై చర్యలు తీసుకుంటారు. అంతేకాక నివేదికను యాప్‌లో రియల్‌టైమ్‌లో సమర్పించడం, పరిశీలనకు 48గంటల కాలపరిమితి నిర్ణయించారు.


