ఇల్లెందు: ఇల్లెందు ఆర్టీసీ బస్టాండ్‌లో శుక్రవారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగింది. మధ్యాహ్నం బస్టాండ్ ప్రయాణికులతో కిటకిటలాడుతున్న సమయంలో ఈ ప్రమాదం ఏర్పడింది. అకస్మాత్తుగా మంటలు వ్యాపించటంతో ప్రయాణికులు పరుగులు తీశారు. విద్యుత్ ప్రమాదం కారణంగా పొగ కమ్మేసింది. డిపోలో ఉన్న సిబ్బంది టీఆర్ గ్యాస్‌ను ఉపయోగించి మంటలను ఆర్పివేశారు. దీంతో త్రుటిలో ప్రమాదం తప్పింది.
రైస్ మిల్లర్ల ఆందోళన
సూపర్‌బజార్(కొత్తగూడెం): సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టర్, అదనపు కలెక్టర్, డీఎస్‌ఓ, డీఎం సివిల్‌కు వినతిపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ధాన్యం మిల్లింగ్ నిలిపివేత , బిల్లింగ్ సమయంలో ఏర్పడిన తరుగు, ఎఫ్‌సీఐ ద్వారా బాయిల్డ్ రైస్ స్వీకరణకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లాలోని అన్ని రైస్ మిల్లుల్లో శుక్రవారం నుంచి మిల్లింగ్ కార్యక్రమాలు నిలిపివేసినట్లు తెలిపారు. సంఘం జిల్లా అధ్యక్షుడు జుగల్ కిషోర్ ఖండేల్వాల్, సెక్రటరీ శ్రీనివాస రెడ్డి, ట్రెజరర్ పల్లపోతు శ్రీనివాసు, నాయకులు వెంకటేశ్వరరెడ్డి, కంచర్ల శ్రీనివాస్ పాల్గొన్నారు.
బాలుడు అదృశ్యం
చండ్రుగొండ: మండలంలోని రామక్కబంజర్ గ్రామానికి చెందిన తెల్లం చరణ్ (17) అదృశ్యంపై శుక్రవారం పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 8న ఇంటి నుంచి బయటకు వెళ్లిన చరణ్ తిరిగి రాలేదు. తండ్రి రాంబాబు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శివరామకృష్ణ రాత్రి తెలిపారు.
పాల్వంచలో యువకుడు..
పాల్వంచరూరల్: యువకుడి అదృశ్యంపై శుక్రవారం కేసు నమోదైంది. పోలీసుల కథనం ప్రకారం.. మండల పరిధిలోని జగన్నాధపురం గ్రామానికి చెందిన, పాల్వంచ మెడికల్ కళాశాల్లో ల్యాబ్ టెక్షీషియన్ కోర్సు చదువుతున్న బోడా పవన్‌తేజా గురువారం కళాశాలకు వెళ్లి తిరిగి రాలేదు. పలుచోట్ల వెతికినా ఆచూకీ లభించలేదు. యువకుడి తండ్రి బాలు శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ సురేష్ తెలిపారు.
లారీ, కారు ఢీ
నలుగురికి గాయాలు
టేకులపల్లి: లారీ, కారు ఢీకొని నలుగురు గాయపడ్డ ఘటన శుక్రవారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పని చేస్తున్న దంపతులు పల్నాటి స్వప్న, నరేంద్ర తమ పిల్లలు అనుచితరామ్, ఆశ్రిత రామ్‌లతో కలిసి కారులో భద్రాచలం వెళ్తున్నారు. టేకులపల్లి మండలం తొమ్మిదోమైలుతండా పంచాయతీ సాయనపేట మలుపు వద్దకు రాగానే ఆర్టీసీ బస్సుని ఓవర్‌టేక్ చేస్తున్న క్రమంలో ఎదురుగా వచ్చిన లారీ ఢీకొట్టింది. దీంతో దంపతులకు తీవ్రగాయాలయ్యాయి. చిన్నారులు స్వల్పంగా గాయపడ్డారు. ప్రమాదంలో కారు ముందు భాగం నుజ్జు నుజ్జయింది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం 108 అంబులెన్ కొత్తగూడెం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఇద్దరిపై కేసు నమోదు
పాల్వంచరూరల్: అప్పు తీర్చాలని అడిగినందుకు దాడి చేసిన ఘటనలో ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. రాహుల్ గాంధీ నగర్‌కు చెందిన మడంశెట్టి సాయిబాబు లక్ష్మీదేవిపల్లికి చెందిన మడిపల్లి అనిల్‌కుమార్‌కు రూ.5 లక్షల అప్పు ఇచ్చాడు. తిరిగి ఇవ్వకపోవడంతో సాయిబాబు ప్రైవేటు కేసు దాఖలు చేశాడు. దీంతో శుక్రవారం అనిల్ కుమార్, అతని తండ్రి వెంకటేశ్వర్లు వెళ్లి దాడి చేసి, చంపుతానని బెదిరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు తండ్రి, కొడుకులపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ సురేశ్ తెలిపారు.
భూ వివాదంలో ముగ్గురిపై ..
మండల పరిధిలోని పాండురంగాపురం శివారులో భూ వివాదం విషయంలో సోమ వెంకట్‌రెడ్డి ఫిర్యాదు మేరకు గంగిరెడ్డి ఆదిలక్ష్మి, సరిత, పిల్లి రఘురాంరెడ్డిలపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ సురేశ్ తెలిపారు.
వివాదాస్పదంగా రోడ్డు
నిర్మాణ పనులు
చండ్రుగొండ: చండ్రుగొండలోని ఆర్‌టీసీ బస్టాండ్, ఊరకుంట చెరువు మీదుగా ఇమ్మడి రామయ్య బంజర్ గ్రామానికి, ఖబరస్తాన్ (శ్మశానవాటిక), ము త్యాలమ్మతల్లి దేవత ఆలయానికి రోడ్డు ఉంది. ఈ మార్గంలో సీసీ రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. కొందరు వ్యక్తులు రోడ్డు నిర్మాణానికి అభ్యంతరం వ్యక్తం చేయడంతో వివా దం నెలకొంది. ఈ క్రమంలో నిధులు రద్దయ్యే పరిస్థితి నెలకొంది. దీంతో గ్రామస్తులు ఐక్యమై భూములకు సంబంధించిన పట్టాదారులతోపాటు పరిస్థితిని వివరించారు. దీంతో రెవెన్యూ అధికారి తిరుపతిరావు, ఎస్‌ఐ శివరామకృష్ణ జోక్యం చేసుకుని శాంతింప జేశారు.


