మణుగూరు టౌన్: మారుజాతి కలప అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్‌ను అటవీ అధికారులు శుక్రవారం సీజ్ చేశారు. మున్సిపాలిటీ పరిధి కమలాపురానికి చెందిన కొందరు మారుజాతి కర్రలను అక్రమంగా ట్రాక్టర్‌లో తరలిస్తుండగా సీజ్ చేశామని అటవీ రేంజర్ ఉపేందర్ తెలిపారు. ఈ నెల 3వ తేదీన కూడా ఒక ట్రాక్టర్‌ను సీజ్ చేశామని పేర్కొన్నారు. తనిఖీల్లో బీట్ ఆఫీసర్లు శాంతి, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.
పామాయిల్ గెలల చోరీ
దమ్మపేట: పామాయిల్ తోటలో గెలల చోరీ ఘటన మండలంలోని ముష్టిబండ గ్రామ శివారులో గురువారం రాత్రి జరిగింది. మండలంలోని ముష్టిబండ గ్రామానికి చెందిన రైతు గుర్రాల లక్ష్మీనారాయణ శుక్రవారం ఉదయం తన తోటలో 1.5 టన్నుల గెలలు నరికి అపహరించినట్లు గుర్తించాడు. బాధిత రైతు ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని అదనపు ఎస్‌ఐ బాలస్వామి తెలిపారు.
బంగారం దుకాణాల్లో బీఐఎస్ దాడులు
520 గ్రాముల ఆభరణాలు సీజ్
భద్రాచలంఅర్బన్: బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) అధికారులు శుక్రవారం భద్రాచలంలోని రెండు బంగారం దుకాణాలపై శుక్రవారం దాడులు నిర్వహించారు. బీఐఎస్ శాస్త్రవేత్తలు, జాయింట్ డైరెక్టర్లు అర్జున్, షణ్ముఖ్ శివ ఆధ్వర్యంలోని తనిఖీలు చేపట్టారు. దుకాణంలో 270 గ్రాములు, మరో దుకాణంలో 250 గ్రాములు కలిపి మొత్తం 520 గ్రాముల బంగారు ఆభరణా లను సీజ్ చేశారు. వీటి విలువ రూ.74 లక్షలు ఉంటుందని అంచనా. ఫిర్యాదులు అందడంతోపాటు ముందుగా సేకరించిన సమాచారం ఆధారంగా దాడులు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. దుకాణానికి బీఐఎస్ లైసెన్స్, ఆభరణాలపై హాల్‌మార్క్ ఉందా? అనే అంశాలనే ప్రధానంగా పరిశీలించామని చెప్పారు. ఆభరణాలపై బీఐఎస్ గుర్తు, బంగారం స్వచ్ఛతను తెలిపే గుర్తు, ఆరు అక్షరాంకాలతో కూడిన ప్రత్యేక గుర్తింపు సంఖ్య ఉండాలన్నారు. కాగా, బీఐఎస్ అధికారుల దాడులు జరుగుతున్న క్రమంలో ఆ పరిసరాల్లోని పలు బంగారం దుకాణాలు మూసివేయడం గమనార్హం. అధికారులు మల్లేష్, అజయ్, హెచ్‌ఎంఆర్ ప్రతినిధులు పాల్గొన్నారు.


