సూపర్‌బజార్(కొత్తగూడెం): కలెక్టరేట్‌లో ఇల్లెందు ప్రాజెక్ట్ పరిధిలోని అంగన్‌వాడీ టీచర్ల పోస్టుల భర్తీకి శుక్రవారం ఇంటర్వ్యూలు నిర్వహించగా, అభ్యర్థులకు కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయలేదు. టెంటు, కుర్చీ, తాగునీటి సౌకర్యాలు కల్పించలేదు. అభ్యర్థుల సర్టిఫికెట్లను డీడబ్ల్యూఓ కార్యాలయంలో పరిశీలించారు. అనంతరం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాలులో ఇంటర్వ్యూ నిర్వహించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందన, డీడబ్ల్యూఓ స్వర్ణలత లెనీనా ఇంటర్వ్యూలు నిర్వహించారు. పసి పిల్లలతో వచ్చిన అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. కలెక్టరేట్ లోపల, బయట ఉన్న గద్దెలపైనే అభ్యర్థులు, సహాయకులు నిరీక్షించారు. కలెక్టరేట్ మీటింగ్ హాల్‌లో అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన చేపడితే అభ్యర్థులకు ఇబ్బందులు ఎదురయ్యేవి కావు. శుక్రవారం ఆ హాల్‌లో ఇతర కార్యక్రమాలు కూడా నిర్వహించలేదు.


