మరింత సమయం | - | Sakshi
Sakshi News home page

మరింత సమయం

Sep 9 2026 12:41 AM | Updated on Sep 9 2026 12:41 AM

● రెండో రోజూ కొనసాగిన ఏఏఐ బృందం పర్యటన ● దుమ్ముగూడెం, బూర్గంపాడు, ములకలపల్లి మండలాల్లో పరిశీలన ● సమాచారం విశ్లేషించాక ఎయిర్‌పోర్ట్‌పై తుది నిర్ణయం

ఎంపికపై నిర్ణయం జరగలేదు..

● రెండో రోజూ కొనసాగిన ఏఏఐ బృందం పర్యటన ● దుమ్ముగూడెం, బూర్గంపాడు, ములకలపల్లి మండలాల్లో పరిశీలన ● సమాచారం విశ్లేషించాక ఎయిర్‌పోర్ట్‌పై తుది నిర్ణయం

సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం/బూర్గంపాడు/దుమ్ముగూడెం: గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్ట్‌ నిర్మాణానికి పరిస్థితులు ఎక్కడ అనుకూలంగా ఉన్నాయనే అంశాన్ని నిర్ధారించడానికి మరింత సమయం పడుతుందని ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా(ఏఏఐ)కి చెందిన సాంకేతిక నిపుణుల బృందం వెల్లడించింది. స్థలాల పరిశీలన కోసం జిల్లాకు వచ్చిన బృందం పర్యటన రెండో రోజైన మంగళవారం కొనసాగింది. ఈ మేరకు ములకలపల్లి మండలం తిమ్మంపేట, దుమ్ముగూడెం మండలం అర్లగూడెం, పెద్ద కమలాపురంతో పాటు బూర్గంపాడు మండలం సారపాక సమీపాన పుష్కరవనం భూములను నిపుణులు పరిశీలించారు.

దుమ్ముగూడెం సానుకూలం

దుమ్ముగూడెంలో ఎంపిక చేసిన భూమి అనుకూలంగా ఉండడం, విమానాశ్రయానికి పెద్దగా అడ్డంకులు లేవని ఏఏఐ బృందం గుర్తించింది. ఇదే సమయాన అటవీ ప్రాంతం ఎక్కువగా ఉండడాన్ని ప్రతికూలంగా పేర్కొంది. భూమి విస్తీర్ణం మాత్రమే కాక భూమి ఎత్తుపల్లాలు, రన్‌వే దిశ, విమానాల అప్రోచ్‌ మార్గం, పరిసర కొండలు, అటవీ ప్రాంతాలు, నీటి ప్రవాహ మార్గాలు, రైల్వే – రహదారి మార్గాలు, విద్యుత్‌ లైన్లు, గాలి వేగం – దిశ, వర్షపాతం, భూసాంకేతిక పరిస్థితులు వంటి అనేక అంశాలను సమగ్రంగా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని ఏఏఐ సాంకేతిక బృందం స్పష్టం చేసింది.

మరింత స్థలం

ములకలపల్లి మండలం తిమ్మంపేట దగ్గర ప్రతిపాదించిన సుమారు 500ఎకరాల విస్తీర్ణాన్ని మ్యాప్‌ ద్వారా నిపుణులు పరిశీలించారు. విమానాశ్రయానికి అవసరమైన రన్‌ వే, అప్రోచ్‌, ఇతర అనుబంధ సౌకర్యాల దృష్ట్యా అదనపు ప్రాంతాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని బృందం వెల్లడించింది. ప్రధానంగా అప్రోచ్‌ ప్రాంతానికి సుమారు 1.5 కి.మీ. వరకు అదనపు స్థలం అవసరమని పేర్కొంది. కాగా, సోమవారం పరిశీలించిన సుజాతనగర్‌ స్థలానికి రైల్వే లైన్‌తో ఉన్న సాంకేతిక ఇబ్బందులను ఇప్పటికే ఏఐఐ టీమ్‌ గుర్తించినట్లు సమాచారం.

పూర్తిస్థాయిలో విశ్లేషించాక...

ప్రతిపాదిత స్థలాలపై క్షేత్రస్థాయిలో సేకరించిన వివరాలను కాంటూర్‌ మ్యాప్‌లు, టోపోగ్రాఫికల్‌ మ్యాప్‌లు, గత 10 – 40 ఏళ్ల వర్షపాతం వివరాలు, గాలి వేగం – దిశకు సంబంధించిన సమాచారంతో అనుసంధానం చేసి సాఫ్ట్‌వేర్‌ ఆధారిత విశ్లేషణ, సిమ్యులేషన్‌ నిర్వహించనున్నట్లు ఏఏఐ టీమ్‌ తెలిపింది. విమానాశ్రయ కార్యకలాపాలు, ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌, కమ్యూనికేషన్‌ వ్యవస్థలు, సివిల్‌ ఇంజినీరింగ్‌ అంశాలను వేర్వేరుగా పరిశీలించి సమగ్ర సాంకేతిక సాధ్యాసాధ్యాలను అంచనా వేయనున్నారు. ఈ ప్రక్రియకు సుమారు 6 – 8 వారాల సమయం పట్టే అవకాశం ఉందని సాంకేతిక బృందం తెలిపింది

ప్రస్తుతం జరుగుతున్న క్షేత్రస్థాయి పరిశీలన ప్రాథమిక సాంకేతిక అధ్యయనంలో భాగమేనని, ఏ ప్రాంతాన్ని విమానాశ్రయానికి ఎంపిక చేస్తూ ఇప్పటివరకు నిర్ణయం తీసుకోలేదని కలెక్టర్‌ అంకిత్‌ వెల్లడించారు. అలాగే, ప్రతిపాదిత ప్రాంతాలకు సంబంధించిన రెవెన్యూ, సర్వే, అటవీ, రహదారులు, రైల్వే, భౌగోళిక, వాతావరణ తదితర వివరాలను సాంకేతిక బృందానికి అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. ఈ పరిశీలనలో కొత్తగూడెం ఆర్డీఓ మధు, సీపీఓ సునీత, తహసీల్దార్లు స్వాతిబిందు, కేఆర్‌కే.ప్రసాద్‌, అశోక్‌కుమార్‌, వివిధ శాఖల అధికారులు శ్రీనివాస్‌, నర్సింహారావు, ఉపేందర్‌, మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement