భద్రాచలం: భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో మంగళవారం నిత్యకల్యాణం, పునర్వసు నక్షత్రం సందర్భంగా పట్టాభిషేకం కనుల పండువగా సాగాయి. తెల్ల వారుజామునే గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం మిథిలా స్టేడియంలోని శ్రీరామ సేవా మండపంలో కొలువుదీర్చి స్వామికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం నిర్వహించారు. ఆతర్వాత స్వామికి కంకణధారణ, యజ్ఞోపవేత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ మహోత్సవం, ఆపై పట్టాభిషేకం పూర్తిచేశారు.
జిల్లాకు కేంద్ర మంత్రి
బండి సంజయ్
చుంచుపల్లి: ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాచలంలో శ్రీ సీతారామచంద్రస్వామి వారి దర్శనంతో పాటు కుటుంబ వేడుకకు హాజరయ్యేందుకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ మంగళవారం జిల్లాకు చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి ఖమ్మం మీదుగా సాయంత్రం కొత్తగూడెం చేరుకోగా అధికారులు, బీజేపీ నాయకులు ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం భద్రాచలం బయలుదేరిన కేంద్ర మంత్రి సారపాకలోని ఐటీసీ గెస్ట్‌హౌస్‌లో రాత్రి బస చేశారు. మంగళవారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి శ్రీ సీతారామచంద్రస్వామిని దర్శించుకున్నాక, బంధువుల వివాహ వేడుకకు హాజరవుతారు. ఈనేపథ్యాన ఆలయ పరిసరాల్లో భద్రతా ఏర్పాట్లను అధికారులు పర్యవేక్షించారు.
జిల్లా టూరిజం నోడల్ అధికారిగా అనూష
సూపర్‌బజార్(కొత్తగూడెం): జిల్లా టూరిజం నోడల్ అధికారిగా జిల్లా పంచాయతీ అధికారి అనూషకు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈమేరకు కలెక్టర్ అంకిత్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలోని పర్యాటక ప్రాంతాలను గుర్తించి, వాటి అభివృద్ధికి ప్రణాళికలను ప్రభుత్వానికి అందించాలని సూచించారు. ఇప్పటివరకు డీవైఎస్‌ఓ పరంధామరెడ్డి టూరిజం శాఖాధికారిగా అదనపు బాధ్యతలు నిర్వహించారు. ఆ స్థానంలో ఇప్పుడు అనూష నియమితులయ్యారు.
ఎఫ్‌బీఓ కుటుంబానికి రూ.30లక్షల పరిహారం
బూర్గంపాడు: వేటగాళ్లు అమర్చిన విద్యుత్ తీగలు తాకి విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన చెరువు సింగారం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నవీన్ కుటుంబానికి అటవీశాఖ ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. ఈమేరకు రూ.30లక్షల పరిహారం మంజూరు చేస్తూ పీసీసీఎఫ్ వినయ్‌కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పరిహారాన్ని నవీన్ భార్య ప్రమీలకు అందించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. గత నెల 11వ తేదీన నకిరిపేట అటవీప్రాంతంలో వన్యప్రాణులను వేటాడేందుకు వేటగాళ్లు విద్యుత్ తీగలు అమర్చగా, తనిఖీలకు వెళ్లిన నవీన్ వాటిని గుర్తించక తాకడంతో అక్కడికక్కడే మృతిచెందిన విషయం విదితమే. ఘటనకు కారకులైన నిందితులను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. ఈక్రమాన బాధిత కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది.
నాణ్యమైన వైద్యసేవలే లక్ష్యం
డీఎంహెచ్‌ఓ తుకారాం రాథోడ్
చుంచుపల్లి/పాల్వంచ: జిల్లాలో అమలవుతున్న జాతీయ ఆరోగ్య కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహిస్తూ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్ తుకారం రాథోడ్ ఆదేశించారు. పాల్వంచలోని కార్యాలయ సమావేశ మందిరంలో మంగళవారం ఆయన ఆరోగ్య సూపర్‌వైజర్లతో పలు అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ గర్భం దాల్చిన మహిళల వివరాలు నమోదు చేసి, షెడ్యూల్ ప్రకారం వైద్య పరీక్షలకు వచ్చేలా అవగాహన కల్పించాలని సూచించారు. అంతేకాక హైరిస్క్ గర్భిణులను పర్యవేక్షించాలని తెలిపారు. అంతేకాక అసంక్రమిత వ్యాధుల గుర్తింపునకు స్క్రీనింగ్ నిర్వహించాలని చెప్పారు. గర్భిణులతో పాటు అర్హులైన ప్రతీ చిన్నారికి టీకాలు అందేలా చూడాలని, కుష్టు బాధితులు నిరంతరం మందులు వాడేలా అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రామ్ అధికారులు డాక్టర్ భూక్యా రామ్‌దాస్, డాక్టర్ టి.ప్రతాప్, డాక్టర్ దినేష్ తదితరులు పాల్గొన్నారు.


