ఇప్పటివరకు అందిన దరఖాస్తులు
● కార్పొరేషన్ ప్రజావాణిపై నీలినీడలు ● ఆరు వారాల్లో 190 వినతులు ● పరిష్కారంపై మాత్రం అస్పష్టత
కొత్తగూడెంఅర్బన్: కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రజల సమస్యల పరిష్కారం కోసం జూలై నుంచి ప్రజావాణి నిర్వహిస్తున్నారు. మేయర్ మూడ్ గణేష్‌తో పాటు కమిషనర్, అధికారులు పాల్గొని దరఖాస్తులు, వినతులు స్వీకరిస్తున్నారు. అయితే, దరఖాస్తులకు సంబంధించి పరిష్కారం మాత్రం లభించడం లేదని ప్రజలు వాపోతున్నారు.
పరిశీలనలోనే ఆలస్యం...
ప్రజావాణిలో అందే దరఖాస్తులను సంబంధిత సెక్షన్‌కు వెంటనే పంపించాలి. ఆ మరుసటి రోజే సిబ్బంది క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే సమస్యకు పరిస్కారం లభిస్తుంది. కానీ కొన్నింటి విషయంలో అధికారులు, సిబ్బంది ఆలస్యం చేయడం వల్ల ఫలితం దక్కడం లేదు. ఇంకొన్ని సమస్యల విషయంలో పరిశీలన చేపట్టినా పరిష్కారం చూపించకుండా వెనక్కి వెళ్తున్నారనే విమర్శలు వస్తున్నారు. దీంతో ప్రజావాణి లక్ష్యం నీరుగారే పరిస్థితి ఎదురవుతోంది. కార్పొరేషన్‌లోని పలు డివిజన్లలో రహదారుల ఆక్రమణ, పారిశుద్ధ్య సమస్య, నీటి సరఫరాలో లోపాలు, కోతుల బెడద తదితర అంశాలపై ఫిర్యాదులు అందుతున్నా పరిష్కారానికి నోచుకోవడం గమనార్హం. కొత్తగూడెం కార్పొరేషన్‌లో జూలై 22వ తేదీ నుంచి ప్రతీ బుధవారం ప్రజావాణి నిర్వహిస్తుండగా, ప్రజలు తమ సమస్యలు వెంటనే పరిష్కారం లభిస్తుందని భావించారు. కానీ కాలక్రమంలో ఆ నమ్మకం కోల్పోగా... దరఖాస్తులు కూడా నానాటికీ తగ్గిపోతున్నాయి.
స్పష్టత కరువు
ఇప్పటివరకు ఆరు బుధవారాలు ప్రజావాణి నిర్వహించారు. ఇందులో 190 దరఖాస్తులు నమోదైనట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. కానీ ఇందులో ఎన్ని పరిష్కరించారు, ఇంకా ఎన్ని పెండింగ్‌లో ఉన్నాయనే వివరాలు వెల్లడించడానికి కార్పొరేషన్ అధికారులు విముఖత వ్యక్తం చేస్తుండడం గమనార్హం. ఇకనైనా పరిష్కారంలో వేగం పెంచకపోతే ప్రజావాణిపై నమ్మకం సన్నగిల్లే అవకాశమున్నందున పాలకవర్గం, అధికారులు స్పందించాల్సిన అవసరముంది.
తేదీ అందిన దరఖాస్తులు
జూలై 22 26
జూలై 29 23
ఆగస్టు 05 64
ఆగస్టు 12 34
ఆగస్టు 19 32
సెప్టెంబర్ 02 1 1
మొత్తం 190


