పాల్వంచరూరల్: పర్యాటకులను ఆకట్టుకోవడమే కాక స్థానికులకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో మండలంలోని కిన్నెరసాని కెనాల్‌లో పుట్టీ నడిపించాలని నిర్ణయించారు. పూర్వ కలెక్టర్ జితేష్ వి.పాటిల్ ఈ విషయమై చొరవ చూపి రూ.40వేల వ్యయంతో మత్స్యశాఖ అధికారుల పర్యవేక్షణలో పుట్టీ తెప్పించారు. అంతేకాక మత్స్య సొసైటీ సభ్యులకు అప్పగించి, ఇద్దరికి శిక్షణ కూడా ఇప్పించారు. అయితే, పునుకుల గ్రామానికి చెందిన మత్స్య సొసైటీ సభ్యులు శిక్షణ తీసుకున్నా, కారణాలేమిటో తెలియదు కానీ పుట్టీ నడపడం లేదు. పర్యాటకులను ఆకట్టుకుంటూ ఆదాయం సాధించే అవకాశం ఉన్నా పక్కన పెట్టడం విమర్శలకు తావిస్తోంది. కలెక్టర్ లేదా టూరిజంశాఖ అధికారులు స్పందిస్తే కిన్నెరసాని కెనాల్ పుట్టీలో పర్యటించే అవకాశం పర్యాటకులకు దక్కనుంది.


