కిరాణా వ్యాపారి ఐపీ దాఖలు
సూపర్‌బజార్(కొత్తగూడెం): ఇల్లెందు స్టేషన్ బస్తీకి చెంది మహిళా కిరాణా వ్యాపారి జోగునూరి నాగమణి సోమవారం ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ కోర్టులో రూ 10.90 లక్షలకు ఐపీ దాఖలు చేశారు. 2020 నుంచి 2025 డిసెంబర్ వరకు కిరాణా షాపు నిర్వహణకు అప్పులు చేసి వడ్డీలు కట్టడంతో ఆర్థికంగా చితికి పోయినట్లు తెలిపారు. న్యాయవాది కె.నాగేశ్వరరావు ద్వారా పిటిషన్ దాఖలు చేశారు.
రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలు
బూర్గంపాడు: మండలంలోని సారపాకలో సోమవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. ఐటీసీ గేటు వైపు నుంచి సారపాక సెంటర్‌కు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి కారు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తాళ్లగొమ్మూరుకు చెందిన వీరయ్య గాయపడ్డారు. స్థానికులు వెంటనే ఆయనను భద్రాచలం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.
హెడ్‌కానిస్టేబుల్ ఆత్మహత్య
టేకులపల్లి: అప్పుల ఊబిలో కూరుకుపోయిన హెడ్‌కాని స్టేబుల్ సోమవారం ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం ప్రకారం.. ఇల్లెందు మండలం సుభాష్ నగర్‌కు చెందిన ఊకే సురేష్ (35) చాతకొండ 6వ బెటాలియన్‌లో హెడ్‌కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాడు. అప్పులు తీర్చే మార్గం లేక తీవ్ర మనోవేదనకు గురవుతున్నాడు. ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లలో డబ్బులు కోల్పోవడం వల్లే ఆయన అప్పుల పాలయ్యారనే ప్రచారం స్థానికంగా సాగుతోంది. కాగా, సోమవారం రోళ్లపాడు క్రాస్ రోడ్డు సమీపంలోని ఆరోమైలు అడవి ప్రాంతంలో చెట్టుకు ఉరివేసుకుని మృతి చెందాడు. టేకులపల్లి సీఐ బత్తుల సత్యనారాయణ, ఎస్‌ఐ కె.తిరుపతి సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహం వద్ద లభించిన సూసైడ్ నోట్ ఆధారంగా మృతుడి వివరాలను ధ్రువీకరించుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా, మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రి కానరాని లోకాలకు వెళ్లిపోవడంతో పసిపిల్లల ఆక్రందనలు ప్రతీ ఒక్కరినీ కలచివేస్తున్నాయి.


