● ఉద్యోగాలు ఇప్పిస్తానని 54 మంది నుంచి రూ.8 కోట్లు వసూలు ● అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చినట్లు వెల్లడించిన డీఎస్పీ అరుణ్‌కుమార్
భద్రాచలంఅర్బన్: ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ 54 మంది నిరుద్యోగుల నుంచి సుమారు రూ.8 కోట్ల వరకు వసూలు చేసి మోసం చేసిన కేసులో రెవెన్యూ శాఖ సీనియర్ అసిస్టెంట్, భద్రాచలం ఎమ్మెల్యే పీఏ కోర్ల కల్యాణ్‌ను భద్రాచలం పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. డీఎస్పీ అరుణ్‌కుమార్ కథనం ప్రకారం.. మణుగూరు మండలం సమితి సింగారం గ్రామానికి చెందిన కల్యాణ్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు వద్ద పీఏగా పనిచేస్తున్న క్రమంలో అధికార వర్గాలతో పరిచయాలు పెంచుకున్నాడు. భద్రాచలం, మణుగూరు, పాల్వంచ, ఇల్లెందు, చర్ల, దుమ్ముగూడెం, వాజేడు, బూర్గంపాడు ప్రాంతాల్లోని నిరుద్యోగులకు బీటీపీఎస్ ఐటీసీ కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి డబ్బులు వసూలు చేశాడు. భద్రాచలానికి చెందిన రాయల శ్రీను ఫిర్యాదుతో పది రోజుల క్రితం పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. దీంతో ఈ నెల 6న నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారించగా ఉద్యోగాల పేరుతో డబ్బు వసూళ్లు, బెట్టింగ్‌లో పోగొట్టుకున్నట్లు తేలింది. సోమవారం మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచగా రిమాండ్‌కు తరలించారు. వివిధ ప్రాంతాల్లో అతనిపై నమోదైన కేసులు విచారణలో ఉన్నట్లు డీఎప్పీ తెలిపారు. కాగా నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు సొమ్ము రికవరీ చేసి, తమకు అందించాలని బాధితులు కోరుతున్నారు. రూ.8 కోట్ల వసూళ్లలో కల్యాణ్ ఒక్కడే ఉన్నాడా? ఇంకెవరైనా ఉన్నారా? అనేది తేలాల్సి ఉంది.


