కొత్తగూడెంఅర్బన్: తెలంగాణ ట్రైబల్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని విద్యానగర్ కాలనీలో ఉన్న శ్రీరామ ఫంక్షన్ హాల్‌లో జరిగిన సర్వసభ్య సమావేశంలో ఈ ఎన్నిక జరిగింది. సమావేశానికి కొత్తగూడెం, వైరా ఎమ్మెల్యేలు కూనంనేని సాంబశివరావు, మాళోత్ రాందాస్ నాయక్ హాజరై మాట్లాడా రు. జర్నలిస్టుల సంక్షేమం కోసం కృషి చేస్తామ ని, సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చా రు. అధ్యక్షుడిగా మాళోత్ అశోక్, ప్రధాన కార్యదర్శిగా భూక్యరాము, ట్రెజరర్‌గా బానోత్ రాందాస్, వైస్ ప్రెసిడెంట్‌గా బదావత్ దశరథ్, గౌరవ సలహాదారులుగా హాలావత్ రామారావుతో మరికొందరిని సభ్యులుగా ఎన్నుకున్నారు. మేయర్ మూడ్ గణేష్, సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె.సాబీర్‌పాషా, మార్కెట్ కమి టీ చైర్మన్ బానోత్ లాల్‌సింగ్, అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు బానోత్ వీరూ నాయక్, జర్నలిస్టు సంఘాల నాయకులు యోగానంద, రవి నాయక్, బి. వెంకటరత్నం, కల్లోజి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాద ఘటనపై కేసు నమోదు
అశ్వాపురం: మండల పరిధిలోని మొండికుంట గ్రామశివారు అటవీ ప్రాంతంలో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతిపై అశ్వాపురం పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం... కొత్తగూడెంలోని గౌతంపూర్‌కు చెందిన తోట వరుణ్(35), పద్దం ముత్తయ్య(38) బైక్‌పై మణుగూరు వచ్చి వెళ్తున్నారు. ఈ క్రమంలో మొండికుంట గ్రామం దాటాక అటవీ ప్రాంతంలో బైక్ అదుపు తప్పి కింద పడి ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు 108 వాహనంలో భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించగా వరుణ్ అప్పటికే మృతి చెందాడు. సింగరేణి ఉద్యోగి పద్దం ముత్తయ్య తీవ్ర గాయాలతో అపస్మారక స్థితికి చేరగా, కొత్తగూడెంలో సింగరేణి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వివాహిత ఆత్మహత్య
పాల్వంచరూరల్: అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులతో వివాహిత ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మండల పరిధిలోని నాగారం గ్రామ పంచాయతీ రేపల్లేవాడ గ్రామానికి చెందిన నారకట్ల నాగమ్మ(50) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. వైద్యఖర్చులకు ఆర్థిక ఇబ్బందులు ఎదురుకావడంతో మనస్తాపం చెంది శనివారం ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరివేసుకుని మృతిచెందింది. మృతురాలికి భర్త, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఎస్‌ఐ సురేష్ కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
గణేష్ విగ్రహాన్ని
తీసుకెళ్తుండగా ప్రమాదం
ఐదుగురికి తీవ్ర,
ముగ్గురికి స్వల్ప గాయాలు
కొండపాక(గజ్వేల్): గణనాథుడి విగ్రహాన్ని తీసుకెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో ఐదుగురికి తీవ్ర, ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటన సిద్దిపేట జిల్లా కొండపాక మండలంలోని దుద్దెడ శివారులో రాజీవ్ రహదారిపై ఆదివారం రాత్రి జరిగింది. వివరాలు ఇలా.. కొత్తగూడేనికి చెందిన 8 మంది యువకులు హైదరాబాద్‌లో విగ్రహం కొనుగోలు ట్రాక్టరుపై తీసుకెళ్తున్నారు. హైదరాబాద్ నుంచి వరంగల్ దారి వెంట ఉన్న లోలెవల్ బ్రిడ్జిల వద్ద నుంచి తీసుకెళ్లడం సాధ్యం కాదని సిద్దిపేట, హుస్నాబాద్ మీదుగా బయలుదేరారు. కాగా దుద్దెడ శివారులోని కలెక్టరేట్ వద్ద రాజీవ్ రహదారిపై రెండు వైపులా విద్యుత్తు వైర్లు అడ్డుగా ఉండటంతో గణనాథుడిని తీసుకెళ్తున్న యువకులు దిగి కర్ర సహాయంతో వైర్లను సరి చేస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ నుంచి సిద్దిపేట వైపునకు వెళ్తున్న సిమెంట్ ట్యాంకర్ యువకులను, గణనాథుడిని తీసుకెళ్తున్న ట్రాలీని ఢీకొట్టింది. దీంతో ఐదుగురు యువకులకు తీవ్ర, మరో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. దీంతోపాటు గణనాథుని విగ్రహం ఎగిరి సుమారు 10 గజాల దూరంలో రోడ్డుపై పడటంతో దెబ్బ తిన్నది. క్షతగాత్రులను అంబులెన్స్‌లో సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. త్రీటౌన్ పోలీసులు ఘటనా స్థలిని పరిశీలించారు. ట్రాఫిక్‌ను క్లియర్ చేసి, సిమెంట్ ట్యాంకర్‌ను స్వాధీనం చేసుకున్నారు.
ఆడిట్‌పై అవగాహన
ఖమ్మం సహకారనగర్: ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు ఆర్థిక క్రమశిక్షణ, పారదర్శకతతో వ్యవహరించడమే కాక చట్టబద్ధమైన నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సీనియర్ చార్టర్డ్ అకౌంటెంట్, ఆడిటర్ పి.మందాకృష్ణ సూచించారు. తెలంగాణ రికగ్నైజ్‌డ్ స్కూల్స్ మేనేజ్‌మెంట్ల అసోసియేషన్(ట్రస్మా) ఆధ్వర్యాన ఖమ్మంలో ఆదివారం అవగాహన సదస్సు నిర్వహించారు. అకౌంట్లు, రికార్డుల నిర్వహణ, వార్షిక బడ్జెట్ తయారీ, ఫీజుల నిర్ణయం, వార్షిక ఆడిట్, పారదర్శక ఆర్థిక విధానాలపై అవగాహన కల్పించారు.


