ఎంబీబీఎస్ చదివేందుకు ఆర్థికసాయం అభ్యర్థిస్తున్న ఆదివాసీ యువకుడు
తల్లిదండ్రులు లేకపోయినా పట్టుదలతో రాణిస్తున్న నక్కా సంతోష్
ములకలపల్లి: నీట్‌లో ర్యాంకు సాధించి ఎంబీబీఎస్‌లో చేరేందుకు ఆర్థికసాయం కోసం ఓ గిరిజన విద్యార్థి ఎదురుచూస్తున్నాడు. ఈనెల 8వ తేదీ (మంగళవారం)లోగా ఫీజు చెల్లించకపోతే సీటు కోల్పోతానని ఆవేదన చెందుతున్నాడు. మండలంలోని సీతాయిగూడెం పంచాయతీ టేకులగుంపు గ్రామానికి చెందిన నక్కా సంతోష్ తండ్రి భాస్కర్ చిన్నతనంలోనే చనిపోయాడు. అమ్మమ్మ పాండ్ర రాజమ్మ ఇంట్లో ఉంటూ, తల్లి వెంకటమ్మ కూలి పనిచేస్తూ కొడుకును సాకింది. సంతోష్ పదో తరగతి చదువుతున్నప్పుడు 2021లో తల్లి కరోనా బారినపడి మృతిచెందింది. తల్లిదండ్రులను కోల్పోయినా పట్టుదలతో విద్యలో రాణిస్తున్నాడు. ఇంటర్ వరకు ప్రభుత్వ గిరిజన విద్యాసంస్థల్లోనే చదివాడు. హైదరాబాద్‌లోని రాజేంద్రగనగర్‌లోని ట్రైబల్ వెల్ఫేర్‌స్టడీ సెంటర్‌లో ఇంటర్ పూర్తి చేసి 976/100 మార్కులు సాధించాడు. గతడాది నీట్‌లో ఆలిండియా స్థాయిలో 2.70లక్షల ర్యాంక్ రాగా, ఒక్క మార్కు తేడాతో ఎంబీబీఎస్ సీటు కోల్పోయాడు. అయినా పట్టువదలకుండా ఈ ఏడాది కూడా పరీక్ష రాశాడు. అమ్మమ్మతో కలిసి కూలి పని చేసుకుంటూనే నీట్‌కు సన్నద్ధమయ్యాడు. 424/720 మా ర్కులు సాధించి ఆలిండియాలో 2,17,301 ర్యాంక్, ఎస్టీ కేటగిరీలో 4,750 ర్యాంకు పొందాడు. ఈక్రమంలో ఇటీవల మండల పర్యటనకు వచ్చిన ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి సంతోష్‌ను అభినందించారు.
దాతలు స్పందిస్తేనే ..
సంతోష్‌కు దుండిగల్‌లోని అరుంధతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్‌లో ఎంబీబీఎస్ సీటు దక్కింది. మంగళవారం(8వ తేదీ సాయంత్రం 4 గంటలు)లోగా ట్యూషన్ ఫీజు రూ.60వేలు, సెక్యూరిటీ రిపా జిట్ రూ. 40 వేలతోపాటు హాస్టల్ ఫీజు చెల్లిస్తేనే సీటు కేటాయిస్తారు. లేకపోతే రద్దవుతుంది. దాతలు ఆదుకోవాలని ఆదివాసీ యువకుడు అర్థిస్తున్నా డు. సహాయంచేసేవారు 91545 80908 నంబర్‌లో సంప్రదించాలని కోరుతున్నాడు.


