● సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం రెండేళ్ల కాలపరిమితి పూర్తి.. ● ఎన్నికల ప్రక్రియ మొదలు పెట్టని కార్మికశాఖ ● 8వ విడత ఎన్నికలపై సందిగ్ధంలో కార్మికవర్గం
రుద్రంపూర్: సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం పదవీ కాలం ఈ నెల 9వ తేదీతో ముగియనుంది. 2023 డిసెంబర్ 27న రెండేళ్ల కాలపరిమితితో ఎన్నికలు జరగ్గా 13 కార్మిక సంఘాలు బరిలో నిలిచాయి. సంస్థవ్యాప్తంగా 11 ఏరియాలు ఉండగా ఏఐటీయూసీ(సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూ నియన్) 5 ఏరియాల్లో, ఐఎన్‌టీయూసీ (సింగరేణి కోల్‌మైన్స్ లేబర్ యూనియన్) ఆరు ఏరియాల్లో గెలిచింది. పోలైన ఓట్లలో 43.20 శాతం ఏఐటీయూసీ సాధించగా, ఐఎన్‌టీయూసీ 37.86 శాతం ఓట్లు సాధించింది. ఎన్నికల నిబంధనల ప్రకారం ఓటింగ్ ఎక్కువ వచ్చిన ఏఐటీయూసీ గుర్తింపు సంఘంగా నిలిచింది. 1998 నుంచి ఇప్పటివరకు ఏడు సార్లు ఎన్నికలు నిర్వహించారు. 7వ దఫా ఎన్నికలు 2023 డిసెంబర్ 27న జరిగాయి. అయితే గెలుపు సాధించాక సుమారు 9 నెలలకు కార్మిక శాఖ 2024 సెప్టెంబర్ 9న గుర్తింపు సంఘానికి అధికారిక పత్రం అందజేసింది. రెండేళ్ల కాలం ఈ నెల 9వ తేదీతో ముగియనుండగా, 8వ విడత ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది.
లేబర్ కోడ్ల ప్రకారం
51 శాతం ఓటింగ్ వస్తేనే..
కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నాలుగు లేబర్ కోడ్‌ల విధానంతో 51 శాతం ఓటింగ్ వస్తేనే గుర్తింపు సంఘంగా, కనీసం 20శాతం వస్తేనే కార్మిక సంఘంగా యాజమాన్యాలు పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. పాత పద్ధతిలో ఎక్కువ ఓటింగ్ వచ్చిన సంఘమే గుర్తింపు సంఘంగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఈసారి ఎన్నికలు కొత్త విధానం ద్వారా పెట్టాలా? పాత విధానంలో పెట్టాలా అనే సందిగ్ధంలో సింగరేణి యాజమాన్యం ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రచారం ప్రారంభించిన యూనియన్లు
సుమారు రెండు నెలల క్రితం నుంచే కార్మిక సంఘాల, ప్రజా సంఘాలు, పార్టీలు సింగరేణి వ్యాప్తంగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఎన్నికలు నిర్వహించాలని కొన్ని సంఘాలు కోర్టుకు కూడా వెళ్లాయి. కొన్ని పార్టీలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటూ రాబోయే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో విజయ అవకాశాలను అంచనా వేసుకుంటున్నాయి. కాంగ్రెస్ నుంచి డిప్యూటీ సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు సంస్థ అభివృద్ధి పేరుతో ప్రచారం నిర్వహించగా, బీజేపీ నుంచి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీలు ప్రచారం చేశారు. హెచ్‌ఎంఎస్ తరఫున తెలంగాణ రక్షణ సేన బాయిబాట పేరుతో ప్రచారం సాగించింది. కార్మికుల సమస్యల పేరుతో సీఐటీయూ, ఐఎఫ్‌టీయూ కూడా ప్రచారం చేస్తున్నాయి.


