రోడ్డుపైనే అంత్యక్రియలు!
కొత్తగూడెంఅర్బన్: పక్కనే డంపియంగ్ యార్డు ఉండటంతో శ్మశానవాటికకు వెళ్లే దారిలో చెత్త నిండిపోవడంతో అంత్యక్రియలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో రోడ్డుపైనే అంత్యక్రియలు పూర్తి చేయాల్సి వస్తోంది. ఆదివారం కొత్తగూడెంలోని 11వ డివిజన్ గౌతంనగర్ శ్మశాన వాటిక వద్ద ఇలాంటి ఘటనే జరిగింది. కార్పొరేషన్ పరిధిలోని గౌతంనగర్‌కు చెందిన ఓ వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. అంత్యక్రియలు నిర్వహించేందుకు బంధువులు శ్మాశన వాటికకు వెళ్లి పరిశీలించగా, రోడ్డు చెత్తాచెదారంతో నిండిపోయి ఉంది. పక్కనే ఉన్న కార్పొరేషన్ డంపింగ్ యార్డులో చెత్త నిండిపోగా, రోడ్డుపైనే వేస్తున్నారు. కాగా, శ్మశానవాటిక రోడ్డుపై ఉన్న చెత్త తొలగించాలని బంధువులు కార్పొరేషన్ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లగా.. ఆదివారం తామేమీ చేయలేమని చేతులు ఎత్తివేశారు. దీంతో చేసేది ఏమీలేక మృతుడి కుటుంబ సభ్యులు డంపింగ్ యార్డు రోడ్డుపైనే దహనసంస్కారాలు పూర్తి చేశారు. ఈ ఘటన కొత్తగూడెం జిల్లా కేంద్రంలో అందరినీ కలవరపరిచింది. సమీపంలో ఇళ్లు ఉండటంతో ఇప్పటికే చెత్తాచెదారంతో దుర్వాసన వస్తోంది. అంత్యక్రియలు కూడా రోడ్డుపైనే నిర్వహించడంతో స్థానికులు ఇబ్బంది పడ్డారు.
ఎట్టకేలకు ఎమ్మెల్యే పీఏ అరెస్ట్?
భద్రాచలంఅర్బన్: ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ డబ్బులు వసూలు చేశానే ఆరోపణల కేసులో భద్రాచలం ఎమ్మెల్యే పీఏ కల్యాణ్‌ను పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేసినట్లు సమాచారం. ఈ నెల 28న ఎఫ్‌ఐఆర్ నమోదు కాగా, తొమ్మిది రోజులపాటు భద్రాచలం డీఎస్పీ అరుణ్‌కుమార్ ఆధ్వర్యంలో దర్యాప్తు సాగించినట్లు తెలుస్తోంది. ఫిర్యాదుదారుల వాంగ్మూలాలు నమోదు చేయడంతోపాటు నగదు లావాదేవీలు, ఇతర కీలక ఆధారాలను పోలీసులు సేకరించినట్లు సమాచారం. ఉద్యోగాల పేరుతో మొత్తం రూ.9 కోట్ల వరకు నగదు వసూలు చేయగా, బాధితులకు సుమారు రూ.3 కోట్ల మేర నగదును తిరిగి చెల్లించినట్లు, మిగిలిన సుమారు రూ.6 కోట్లను బెట్టింగ్‌లో కోల్పోయినట్లు విచారణలో వెల్లడైనట్లు తెలుస్తోంది. వసూలు చేసిన నగదు ఎవరెవరి నుంచి వచ్చింది? ఎంత మొత్తాన్ని ఎవరికి తిరిగి ఇచ్చారు? అనే అంశాలపై పోలీసులు మరింత లోతుగా ఆరా తీస్తున్నట్లు సమాచారం. కాగా, కేసు పూర్తి వివరాలను సోమవారం పోలీసులు మీడియాకు వెల్లడించే అవకాశం ఉంది.


