● సంగారెడ్డి మహిళను టేకులపల్లి రప్పించిన కేటుగాళ్లు ● రూ.1.40 లక్షలు తీసుకుని భయాందోళన సృష్టించి ఉడాయింపు
టేకులపల్లి: పిల్లలులేని ఆవేదనను ఆసరాగా చేసుకుని, దత్తత పేరిట ఓ అమాయక మహిళను మోసగించి నగదు దోచుకున్న అంతర్ జిల్లా కేటుగాళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం టేకులపల్లి సర్కిల్ కార్యాలయంలో సీఐ సత్యనారాయణ, ఎస్‌ఐ కే.తిరుపతితో కలిసి ఇల్లెందు డీఎస్పీ యు.వెంకన్న వెల్లడించిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ మండలం బీరంగూడ గ్రామానికి చెందిన గౌరిగారి ప్రమీలకు వివాహమై 8 సంవత్సరాలు గడుస్తున్నా సంతానం కలగలేదు. దీంతో పిల్లల కోసం ఇన్‌స్ట్రాగామ్ ద్వారా ఆవేదన పంచుకుంది. ఆమె ఆవేదనను ఆసరాగా చేసుకుని ఖమ్మానికి చెందిన ఓ వ్యక్తి వాట్సాప్ ద్వారా సంప్రదించాడు. రూ. నాలుగు లక్షలు ఇస్తే, బాబును దత్తత ఇప్పిస్తామని చెప్పి రూ. 1,40,000 ఒప్పందం చేసుకున్నాడు. ఈ క్రమంలోనే ఆమెను ఈ నెల 4న టేకులపల్లి పరిధిలోని ఏ కాలనీతండా వైకుంఠధామం సమీపానికి రప్పించి నగదు తీసుకున్నాడు.
నటిస్తూ.. పరార్
ముందస్తు పథకం ప్రకారం అదే సమయంలో లక్ష్మీదేవిపల్లి మండలానికి చెందిన యదళ్లపల్లి రాంబాబు, అతని కుమారుడు రోహిత్ మరికొందరితో బైక్‌లపై వచ్చి గొడవ పడుతున్నట్లు నటించి భయాందోళన సృష్టించారు. డబ్బులు తీసుకున్న వ్యక్తి వారి బైక్ ఎక్కి పారిపోగా, బాధితురాలు మోసపోయానని గ్రహించి పోలీసులను ఆశ్రయించింది. విచారణ ప్రారంభించిన పోలీసులు శనివారం కారుకొండ క్రాస్ రోడ్డు వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు. అనుమానాస్పదంగా సంచరిస్తున్న వ్యక్తులను గమనించి పట్టుకున్నారు. విచారించడంతో దత్తత మోసం బయటపడింది. దీంతో కేసు నమోదు చేశారు. ఈ ఘటనతో సంబంధం ఉన్న లక్ష్మీదేవిపల్లి మండలానికి చెందిన యదళ్లపల్లి రాంబాబు, రోహిత్, తాటి నాగరాజు, ఈసం రాంబాబు, మడివి వెంకటేష్, మడివి శారదలను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ప్రధాన సూత్రధారి ఖమ్మానికి చెందిన వ్యక్తితోపాటు మరో కొందరు పరారీలో ఉన్నారు. నిందితుల నుంచి రూ. 1.40 లక్షల నగదు, రెండు ద్విచక్ర వాహనాలు, 4 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఫిర్యాదు అందాక తక్కువ సమయంలోనే సాంకేతిక పరిజ్ఞానం, సమయస్ఫూర్తితో కేసును చాకచక్యంగా ఛేదించిన సీఐ సత్యనారాయణ, ఎస్‌ఐ తిరుపతి , పోలీసు సిబ్బందిని డీఎస్పీ వెంకన్నబాబు ప్రత్యేకంగా అభినందించారు.


