చుంచుపల్లి: ఆధునిక హంగులతో బస్టాండ్లను తీర్చిదిద్దనున్నట్లు కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తెలిపారు. శనివారం రాత్రి ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజశేఖర్‌తో కలిసి ఆయన కొత్తగూడెం బస్టాండ్‌ను పరిశీలించారు. బస్టాండ్‌లో నెలకొన్న అధ్వాన పరిస్థితులను, వర్షాకాలంలో ప్రయాణికులు పడుతున్న తీవ్ర ఇబ్బందులను ఉన్నతాధికారులకు కూనంనేని వివరించారు. అనంతరం మాట్లాడుతూ నూతన భవన నిర్మాణం కోసం నియోజకవర్గ అభివృద్ధి నిధుల (సీడీఎఫ్) నుంచి రూ.5 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. కొత్తగూడెం బస్టాండ్ సమగ్ర ఆధునికీకరణకు రూ.20 కోట్లు, పాల్వంచ బస్టాండ్‌ను నూతనంగా నిర్మించేందుకు మరో రూ.10 కోట్లతో సమగ్ర ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు వెల్లడించారు. అధికారులు జాప్యం లేకుండా టెండర్ల ప్రక్రియను పూర్తి చేయాలని అన్నారు. ఆర్టీసీ కార్మిక సంఘం నాయకులు కందుల భాస్కర్ తదితరులు పాల్గొన్నారు
పాల్వంచ బస్టాండ్ తనిఖీ
పాల్వంచ: ఆర్టీసీ బస్టాండ్‌ను శనివారం రాత్రి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజశేఖర్‌తో కలిసి తనిఖీ చేశారు. బస్టాండ్ పరిసరాలను పరిశీలించి సమస్యలను తెలుసుకున్నారు.
ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు


