మారిన పరిస్థితులు
● సింగరేణి ఎక్స్‌ప్రెస్ రైలు ఏర్పాటు చేసి యాభై ఏళ్లు పూర్తి ● 1976 సెప్టెంబర్ 2న కొత్తగూడెం, బెల్లంపల్లి మధ్య ప్రారంభం ● కోల్‌బెల్ట్ లైఫ్‌లైన్‌గా మారిన రైలు సౌకర్యం
అంతకుముందు 24 గంటల ప్రయాణం
1975లో గోదావరిఖని, మందమర్రి, శ్రీరాంపూర్, రవీంద్రఖని, మణుగూరు ఏరియాల్లో బొగ్గు తవ్వకాలు మొదలయ్యాయ. లక్షల మంది కార్మికులు గనుల్లో పనిచేశారు. దీంతో బెల్లంపల్లి నుంచి గోదావరిఖని (రామగుండం) మీదుగా కొత్తగూడెం వరకు రాకపోకలు పెరిగాయి. ఇందుకోసం కొత్తగూడెంలో మధ్యాహ్నం 3:30 గంటలకు ప్యాసింజర్ రైలు ఎక్కి సాయంత్రం 6:30 గంటలకు డోర్నకల్‌లో దిగాల్సి వచ్చేది. అక్కడ రాత్రి 9 గంటలకు పూరీ – సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టుకుని అర్ధరాత్రి 2 గంటలకు కాజీపేటలో దిగేవారు. మరుసటి రోజు తెల్లవారుజామున 5 గంటలకు కాజీపేట – వార్థా ప్యాసింజర్ రైలు ఎక్కితే మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 3 గంటల మధ్య రామగుండం – మందమర్రి – బెల్లంపల్లి స్టేషన్లలో దిగేవారు. అటు నుంచి ఇటు కూడా ఇదే విధంగా జఠిలమైన ప్రయాణం ఉండేది. బెల్లంపల్లిలో పని చేసే కార్మికులు, వారి కుటుంబాల వారు ప్రధాన కార్యాలయం ఉన్న కొత్తగూడెం వచ్చేందుకు 24 గంటల సమయం పట్టేది. దీంతో డోర్నకల్, కాజీపేటలలో తినేందుకు వీలుగా ప్రయాణికులు చద్దిమూట కట్టకుని వెళ్లేవారు. ఈ అలవాటును 2006లో కాజీపేట జంక్షన్ బైపాస్ అయ్యే వరకు కొనసాగింది.
1976లో ప్రారంభం
సింగరేణి కార్మికులు, అధికారులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని రైల్వేశాఖ భద్రాచలంరోడ్ – బెల్లంపల్లి మధ్య 1976 సెప్టెంబరు 2న సింగరేణి ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభించింది. దీంతో ఉదయం ఆరు గంటలకు కొత్తగూడెంలో ఈ రైలు బయల్దేరితే మధ్యాహ్నం 11 గంటలకు బెల్లంపల్లి చేరుకునేది. అక్కడ తిరుగు ప్రయాణమై రాత్రి 8 గంటలకు కొత్తగూడెం వచ్చేది. ఆరంభంలో ఏసీ కోచ్‌లు కూడా ఉండేవి. సింగరేణి ఉన్నతాధికారులు నేరుగా రైలు ఎక్కేందుకు వీలుగా ప్లాట్‌ఫారమ్ మీదకు కార్లు వచ్చే సౌకర్యం కొత్తగూడెం స్టేషన్‌లో ఉండేది. ఆ రోజుల్లోనే కొత్తగూడెం, రామగుండం, బెల్లంపల్లి స్టేషన్లలో ఏసీ వెయిటింగ్ హాల్స్ ఉండేవి. రైలు ప్రారంభానికి గుర్తుగా రైల్వేశాఖ ప్రత్యేకంగా పోస్ట్‌కార్డును విడుదల చేయడమనేది ఆ రోజుల్లో దేశవ్యాప్తంగా కొత్తగూడేనికి ఉన్న ప్రాధాన్యతను ఇప్పటికీ గుర్తుచేస్తోంది.
ఆరంభించడమే ఆలస్యం సింగరేణి రైలు ఎప్పుడు ప్రయాణికులతో కిటకిటలాడేది. కొత్తగూడెం నుంచి బెల్లంపల్లి వరకు ఒక్కటే రైలు కావడంతో కాలకమ్రంలో స్టాపులు పెరిగాయి. ఎక్స్‌ప్రెస్ హోదా పోయి ఫాస్ట్ ప్యాసింజర్ స్థాయికి పడిపోయింది. దీంతో ప్రయాణ సమయం పెరగడంతో దాన్ని తగ్గించేందుకు కాజీపేట – సిర్పూర్ కాగజ్‌నగర్‌ల మధ్య రామగిరి పేరుతో రేక్ షేరింగ్ రైలు మొదలు పెట్టాల్సి వచ్చింది. సింగరేణి ప్రయాణంలో లంచ్‌బ్రేక్ స్టేషన్‌గా పేరున్న కాజీపేటను 2006 తర్వాత బైపాస్ చేశారు. ఆ తర్వాత ఐసీఎఫ్ కోచ్‌లను తీసి పుష్‌పుల్ రైలుగా మార్చారు. ఈ మార్పులపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేయడంతో వాష్ రూమ్స్ సౌకర్యం ఉన్న కోచ్‌లను అందుబాటులోకి తెచ్చారు. మరోవైపు సింగరేణికి జోడిగా మొదలైన ఇల్లెందు – కారేపల్లి – డోర్నకల్ ప్యాసింజర్ కథ కూడా అర్ధంతరంగా ముగిసింది. జెన్‌జీ తరానికి సింగరేణి ప్రాముఖ్యత పెద్దగా తెలియకపోవచ్చు కానీ బేబీ బూమర్స్, జనరేషన్ ఎక్స్, మిలీనియల్స్‌కు సింగరేణి అంటే ఓ ఎమోషన్. ఎన్నో జ్ఞాపకాల సమ్మేళనం.


