● జోరందుకున్న మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ ప్రచారం ● తెలంగాణ వచ్చాక ప్రతీసారి ఖమ్మానికే కేబినెట్‌లో బెర్త్ ● జిల్లాకు ఈసారైనా చోటు కల్పించాలని ప్రజల వేడుకోలు
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: రాష్ట్ర మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణపై నెలరోజులుగా ప్రచారం సాగుతోంది. సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ పర్యటన ముగియడంతో ఇక కేబినెట్‌లో మార్పులు జరుగుతాయనే వార్తలు మరింత జోరందుకున్నాయి. దీంతో మంత్రుల పర్యవేక్షణలేక కనీసం రోడ్డు మరమ్మతులు సైతం సకాలంలో చేసుకోలేని దుస్థితిలో నిలిచిన జిల్లాకు కేబినెట్‌లో చోటు కల్పించాలనే డిమాండ్ ఏజెన్సీ ప్రజల నుంచి వస్తోంది.
మరమ్మతులకూ దిక్కులేదు
భద్రాచలంలో గోదావరిపై నిర్మించిన రెండో వంతెన అప్రోచ్ వాల్ ఏప్రిల్‌లో కూలిపోయింది. వంతెన జాతీయ రహదారి 30పై ఉంది. జూలై, ఆగస్టులో గోదావరికి వచ్చే భారీ వరదలను దృష్టిలో ఉంచుకుని వంతెన మరమ్మతు పనులను నెలరోజుల్లోపే ముగించాలి. అయితే, పనుల పురోగతిని పట్టించుకునే వారు కరువైపోవడంతో సెప్టెంబర్ వచ్చినా ఇంకా పనులు కొనసాగుతూనే ఉన్నాయి. దాదాపు ఐదు నెలలుగా రెండో వంతెనపై రాకపోకలు ఆపేశారు. ఒకే వంతెనపై ట్రాఫిక్ రద్దీ కారణంగా జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి చనిపోయిన తర్వాత రెండో వంతెనపై ట్రాఫిక్‌కు అనుమతి వచ్చింది. జిల్లా కేంద్రమైన కొత్తగూడెంలో ఉన్న గోధుమవాగు, ముర్రేడు వాగు వంతెనలపై ఉన్న గోతులు రోజురోజుకు పెద్దవిగా మారుతున్నాయని తప్పితే మరమ్మతులకు నోచుకోవడం లేదు. పర్యవేక్షణ కరువైపోవడమే దీనికి కారణమనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇవి మచ్చుకు రెండు ఉదాహరణలే. లెక్క తీస్తే ఇలాంటివి మండలానికి పదికి తక్కువ కాకుండా ఉంటాయి. ఈ పరిస్థితిలో మార్పు రావాలంటే జిల్లాకు కూడా కేబినెట్‌లో చోటు కల్పించాలనే డిమాండ్‌కు రోజురోజుకూ మద్దతు పెరుగుతోంది.
ఖమ్మానికే కేబినెట్
తెలంగాణ ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటివరకు మూడు ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. మూడు సార్లు కేబినెట్ బెర్తులు ఖమ్మం జిల్లాకే దక్కాయి. తొలి సారి తుమ్మల నాగేశ్వరరావుకు మంత్రి పదవి దక్కింది. ఆ తర్వాత ఆయన పాలేరు నుంచి గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టారు. అనంతరం ఖమ్మం నుంచి గెలిచిన పువ్వాడ అజయ్‌కుమార్ కేబినెట్‌లో చోటు దక్కించుకున్నారు. ప్రస్తుత ప్రభుత్వంలో మధిర నుంచి భట్టి విక్రమార్క, ఖమ్మం నుంచి తుమ్మల నాగేశ్వరరావు, పాలేరు నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రులుగా కొనసాగుతున్నారు. మొత్తంగా పాలేరు, ఖమ్మం అసెంబ్లీ నియోజకర్గాలకు రెండు సార్లు అదృష్టం వరించింది. కానీ జిల్లాలో కూడా ఖమ్మం తరహాలోనే ఐదు అసెంబ్లీ స్థానాలు ఉన్నా ఒక్కసారి కూడా కేబినెట్ బెర్త్ దక్కలేదు. తొలిసారి కొత్తగూడెం నుంచి గెలిచిన జలగం వెంకట్రావుకు పార్లమెంట్ కార్యదర్శి పదవి ఇవ్వగా కోర్టు జోక్యంతో అది మూణ్నాళ్ల ముచ్చటేగానే ముగిసింది. రెండోసారి పినపాక నుంచి గెలిచిన రేగా కాంతారావుకు విప్ పదవి దక్కింది. ఇవి రెండు ప్రొటోకాల్ వరకే కేబినెట్ స్థాయిని కలిగి ఉంటాయి తప్పితే పరిపాలనలో వీటి ప్రాధాన్యత దాదాపు శూన్యమనే చెప్పుకోవచ్చు. ప్రస్తుతం కేబినెట్‌లో ఆ స్థాయి కూడా జిల్లాకు దక్కలేదు.
అర్హత, అనుభవం కలిగినవారు ఉన్నా..
● గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, సీపీఐలు మిత్రపక్షాలుగా పోటీ చేశాయి. కొత్తగూడెం నుంచి సీపీఐ తరఫున కూనంనేని సాంబశివరావు ఉన్నారు. 50 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితం, ప్రజా పోరాటాలు ఆయన సొంతం. రెండోసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా కూనంనేని కొనసాగుతున్నారు.
● ప్రస్తుతం మంత్రులుగా ఉన్న భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు రాజకీయాల్లోకి రాకముందే పాయం వెంకటేశ్వర్లు రాజకీయాల్లో ఉన్నారు. రద్దయిన బూర్గంపాడు నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన రికార్డు ఆయపకు ఉంది. మూడుసార్లు మూడు వేర్వేరు పార్టీల నుంచి గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టారు.
● కోరం కనకయ్య ఇల్లెందు నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. జిల్లా పరిషత్ చైర్మన్‌గా కూడా పని చేశారు. మంత్రి పదవి అప్పగించేందుకు అవసరమైన రాజకీయ అనుభవం కనకయ్యకు ఉంది.
● జారే ఆదినారాయణ తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. రాజకీయ అనుభవం తక్కువైనా విద్యార్థి దశ నుంచే ఎన్‌సీసీ సభ్యుడిగా క్రమశిక్షణ కలిగిన వ్యక్తిగా పేరుంది.


