అశ్వారావుపేటరూరల్: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదివారం అశ్వారావుపేటలో పర్యటిస్తారని ఆయిల్‌ఫెడ్ డీఓ ఎస్.శంకర్ తెలిపారు. శనివారం కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ మండలంలోని నారంవారిగూడెం ఆయిల్‌ఫెడ్ నర్సరీలో రైతులకు పామాయిల్ మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యేలు జారె ఆదినా రాయణ, మట్టా రాగమయితో కలిసి ప్రారంభిస్తారని చెప్పారు. అనంతరం పామాయిల్ రైతులతో ముఖాముఖి ఉంటుందని, ఆ తర్వా త అశ్వారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీని సందర్శిస్తారని పేర్కొన్నారు.
నేడు మారెళ్లపాడు
లిఫ్ట్ ట్రయల్ రన్
అశ్వాపురం: మండల పరిధిలోని బీజీ కొత్తూరులోని సీతారామ ప్రాజెక్ట్ పేస్–1 పంప్‌హౌస్ సమీపంలో నిర్మించిన మారెళ్లపాడు ఎత్తిపోతల పథకానికి ఆదివారం ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. గత నెల 15న లిఫ్ట్ ద్వారా తుమ్మల చెరువుకు నీరు వదలాల్సి ఉంది. అనంతరం గత నెల 29న మంత్రుల చేతుల మీదుగా ప్రారంభించాలని నిర్ణయించారు. పనులు పూర్తికాకపోవడంతో మంత్రుల పర్యటన రద్దు కావడంతోపాటు ప్రారంభోత్సవం జరగలేదు. ప్రస్తుతం పనులు పూర్తి కావడంతో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ట్రయల్ రన్ నిర్వహించనుండగా, నీటిపారుదల శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. లిఫ్ట్ ద్వారా సీతారామ ప్రాజెక్ట్ జలాలు తుమ్మలచెరువుకు తరలించనున్నారు.
7,8 తేదీల్లో అలింకో క్యాంపు
కొత్తగూడెంఅర్బన్: తెలంగాణ సమగ్ర శిక్ష, అలింకో ఆధ్వర్యంలో పాతకొత్తగూడెంలోని ఆనందఖని పాఠశాలలో ఈ నెల 7, 8 తేదీల్లో దివ్యాంగ విద్యార్థులకు అసెస్‌మెంట్ అండ్ ఐడెంటిఫికేషన్ క్యాంపు నిర్వహించనున్నట్లు డీఈఓ వాసంతి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. సీడబ్ల్యూఎస్‌ఎన్‌కు సంబంధించిన క్యాంపులో పిల్లలను పరీక్షించి వారికి కావా ల్సిన మెటీరియల్ అందజేస్తామని పేర్కొన్నారు. విద్యార్థులు ఆధార్ కార్డు, యూడీఐడీ కార్డు, ఆదాయం సర్టిఫికెట్ తెచ్చుకోవాలని కోరారు. 7న ఆళ్లపల్లి, అన్నపురెడ్డిపల్లి, అశ్వారావుపేట, అశ్వాపురం, భద్రాచలం, బూర్గంపాడు, చర్ల, చంద్రుగొండ, చుంచుపల్లి, దమ్మపేట, దుమ్ముగూడెం మండలాల వారికి, 8న గుండాల, జూలూరుపాడు, కొత్తగూడెం, కరకగూడెం, లక్ష్మీదేవిపల్లి, ములకలపల్లి, మణుగూరు, పాల్వంచ, సుజాతనగర్, టేకులపల్లి, ఇల్లెందు, పినపాక మండలాల వారికి క్యాంపు ఉంటుందని వివరించారు.
సింగరేణిలో 34 మంది మైనింగ్ అధికారుల బదిలీ
రుద్రంపూర్: వివిధ ఏరియాల్లో పనిచేస్తున్న 34 మంది మైనింగ్ అధికారులను బదిలీచేస్తూ శనివారం రాత్రి సింగరేణి యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది. వీరిలో ఇద్దరు ఏజీఎంలు, నలుగురు డీవైజీఎంలు, ముగ్గురు ఎస్‌వోఎంలు, కాలరీ మేనేజర్ ఒకరు, 8 మంది అడిషనల్ మేనేజర్లు, ఐదుగురు డిప్యూటీ మేనేజర్లు, ఏడుగురు డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ మైనింగ్ ఇంజనీర్లు, సీనియర్ అండర్ మేనేజర్ ఒకరు, మేనేజ్‌మెట్ ట్రైనీ (మైనింగ్) అధికారులు ముగ్గురు ఉన్నారు. వీరందరూ ఈ నెల 10వ తేదీన వారికి కేటాయించిన ఏరియాల్లో విధుల్లో చేరాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.
మరమ్మతులు
వేగవంతం చేయాలి
జెన్‌కో డైరెక్టర్లు లక్ష్మయ్య, రాజశేఖర్ రెడ్డి
పాల్వంచ: కేటీపీఎస్ 7వ దశ కర్మాగారంలో మరమ్మతులు వేగవంతం చేయాలని జెన్‌కో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బాదావత్ లక్ష్మయ్య, థర్మ ల్ డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి అన్నారు. కర్మాగారంలో సాంకేతిక సమస్యతో ఉత్పత్తి నిలిచి పోవడంతో బీహెచ్‌ఈఎల్ ఆధ్వర్యంలో చేపడుతు న్న మరమ్మతు పనులను శనివారం పరిశీలించారు. రూ.20కోట్లతో ఉత్తరాఖండ్ నుంచి తెప్పించి బిగిస్తున్న రోటర్ పనులను పర్యవేక్షించారు. రోటర్‌ను యూసీబీలో ఏర్పాటు చేసే పనులతోపాటు, ఎలక్ట్రికల్, మెకానికల్ పరీక్షలు, ఇతర విభాగాల్లో జరుగుతున్న పనుల వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంస్థకు నష్టం వాటిల్లుతున్న తరుణంలో మరమ్మతులు సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం కోల్ యార్డులో బొగ్గు నిల్వలను పరిశీలించారు. సీఈ ఎం.ప్రభాకర్ రావు, ఎస్‌ఈలు యుగపతి, శ్రీనివాసరావు, రాజ్‌కుమార్ పాల్గొన్నారు.


