వన్యప్రాణి సంచారంపై సర్వే..
● కిన్నెరసాని అభయారణ్యంలో జంతువుల అడుగుజాడల కోసం సర్వే ● ములుగు ఫారెస్ట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్ సెంటర్ విద్యార్థుల పరిశోధన
పాల్వంచరూరల్: అటవీ ప్రాంతంలో వన్యప్రాణుల ఆనవాళ్లు, అడుగుజాడల కోసం విద్యార్థులు సర్వే నిర్వహిస్తున్నారు. సిద్ధిపేట జిల్లా ములుగులోని ఫారెస్ట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్ సెంటర్‌లో బీఎస్సీ(ఫారెస్ట్) తృతీయ సంవత్సరం చదువుతున్న 15 మంది విద్యార్థులు ప్రాజెక్ట్ వర్క్‌లో భాగంగా జంతువులపై అధ్యయనం చేసేందుకు వచ్చారు. డీఎఫ్ ఓ సిద్ధార్థ విక్రమ్‌సింగ్, వైల్డ్‌లెఫ్ ఎఫ్‌డీఓ బాబు వారిలో పది మందిని కిన్నెరసాని అభయారణ్యంలోకి, మరో ఐదుగురిని అశ్వారావుపేట రేంజ్‌లో కేటాయించారు. నెలరోజులపాటు సర్వే జరగనుండగా విద్యార్థులు అటవీ జంతువుల అడుగుజాడలను గుర్తించి నివేదిక అందించనున్నారు. విద్యార్థులకు ఎఫ్‌బీఓలు సహకరిస్తున్నారు. సర్వే ప్రారంభించి పక్షం రోజులు పూర్తయింది. అశ్వారావుపేట రేంజ్, అభయారణ్యంలోని యా నంబైలు, ఆళ్లపల్లి, రంగాపురం రేంజ్‌లలో సర్వే పూర్తికాగా, ప్రస్తుతం చింతోని చెలక ఏరియాలో సర్వే నిర్వహిస్తున్నారు. 15మంది విద్యార్థుల్లో ఐదుగురు విద్యార్థినులు కూడా ఉన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు అటవీ ప్రాంతంలో సంచరిస్తూ వివరాలు సేకరిస్తున్నారు. రాత్రి అడవిలోని బేస్ క్యాంప్‌ల్లోనే వంటావార్పు చేసుకుని అక్కడే నిద్రిస్తున్నారు.
ఫారెస్ట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రీసెర్స్ సెంటర్‌లో విద్యార్థులు కోర్సులో భాగంగా ప్రాజెక్ట్ వర్క్ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఏటా ఏదో ఒక అంశంపై పరిశోధన సాగించాలి. ఈసారి వన్యప్రాణి సంచారం, జీవన విధానంపై సర్వే నిర్వహిస్తున్నారు. మరో 15 రోజులైతే సర్వే ముగుస్తుంది. అనంతరం నివేదిక అందిస్తారు.
–బి.బాబు, వైల్డ్‌లైఫ్ విభాగం ఎఫ్‌డీఓ


