సైబర్‌మ్యూల్‌ గుట్టురట్టు | - | Sakshi
Sakshi News home page

సైబర్‌మ్యూల్‌ గుట్టురట్టు

Sep 5 2026 12:20 AM | Updated on Sep 5 2026 12:20 AM

ఖమ్మంపై ప్రత్యేక నజర్‌..

తాజాగా ఇద్దరి అరెస్టు..

తాజాగా ఇద్దరి అరెస్టు..

రూ.6.23 కోట్ల లావాదేవీలు వివాదాస్పదం

ఎనిమిది పోలీస్‌స్టేషన్లలో

25 కేసులు నమోదు

కొన్నాళ్లుగా ఖమ్మం యూనిట్‌లో టీజీసీఎస్‌బీ ఆపరేషన్‌

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..

సాక్షి ప్రతినిధి, ఖమ్మం: కమీషన్‌కు ఆశపడి సైబర్‌ నేరగాళ్లకు సహకరిస్తూ, అక్రమ లావాదేవీలకు చేయూతగా నిలుస్తున్న వారి మ్యూల్‌ ఖాతాల గుట్టురట్టయింది. తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో(టీజీసీఎస్‌బీ) ఈ దందాను ఛేదించింది. ఖమ్మం జిల్లా పోలీసులతో పాటు 40 మంది పోలీసు అధికారులతో కూడిన 11 బృందాలు రెండు రోజులు ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించాయి. తాజాగా ఇద్దరిని అరెస్టు చేసి వీరు తీసిన 10 మ్యూల్‌ ఖాతాలను గుర్తించారు. టీజీసీఎస్‌బీ ప్రత్యేక ఆపరేషన్‌లో 30 బ్యాంకు శాఖల్లో 121 మ్యూల్‌ ఖాతాలు, పెద్ద మొత్తంలో ఏటీఎం విత్‌డ్రాతో సంబంధం ఉన్న 273 ఖాతాలు ఉన్నట్లు తేలింది. అలాగే, రూ.20 వేల కన్నా ఎక్కువ మొత్తంలో చెక్కులు విత్‌డ్రా చేసిన 12 ఖాతాలు, 25 అనుమానిత ప్రాంతాలను గుర్తించారు. ఇవన్నీ రాష్ట్రంలోనే కాక దేశంలోని పలు సైబర్‌ నేరాలతో ముడిపడి ఉన్నట్లు తేలింది. వీటికి సంబంధించి రూ.7.84 కోట్ల లావాదేవీలు జరగగా.. అందులో రూ.6.23 కోట్లు వివాదాస్పద లావాదేవీలుగా గుర్తించారు. ఈ వివరాలను టీజీసీఎస్‌బీ డైరెక్టర్‌ శిఖా గోయల్‌ శుక్రవారం మీడియాకు వెల్లడించారు.

ఎనిమిది స్టేషన్లలో 25 ఎఫ్‌ఐఆర్‌లు..

మ్యూల్‌ అకౌంట్లకు సంబంధించి జిల్లాలోని ఎనిమిది పోలీస్‌ స్టేషన్ల పరిధిలో 25 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. ఖమ్మం టూ టౌన్‌, ఖానాపురం హవేలీ పోలీస్‌ స్టేషన్లలో ఏడు చొప్పున, ఖమ్మం వన్‌ టౌన్‌లో నాలుగు, ఖమ్మం త్రీ టౌన్‌, ఖమ్మం రూరల్‌లో రెండేసి, కారేపల్లి, నేలకొండపల్లి, కామేపల్లి పోలీస్‌ స్టేషన్లలో ఒక్కో కేసు ఇందులో ఉన్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో టీజీసీఎస్‌బీ నిర్వహించిన ‘ఆపరేషన్‌ క్రాక్‌డౌన్‌ – 1.0’లో ఖమ్మం యూనిట్‌ పరిధి ఆరు బ్యాంకు శాఖల్లో 75 మ్యూల్‌ ఖాతాలను గుర్తించింది. వీటి ఆధారంగా 75 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసి 25 మందిని అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో వ్యాపారులు, కార్మికులు, ప్రైవేట్‌ ఉద్యోగులు, నిరుద్యోగులు, మాజీ సీఎస్‌బీ బ్యాంకు ఉద్యోగులు ఉన్నారు.

ఇతర రాష్ట్రాల నెట్‌వర్క్‌లపై ఆరా..

మ్యూల్‌ ఖాతాలు, ఏటీఎం, చెక్కు ఉపసంహరణలు, పరికరాలు, లబ్ధిదారులు, ఇతర లావాదేవీల వివరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. నగదు ప్రవాహాన్ని గుర్తించడంతోపాటు ఖాతాలను నిర్వహించిన వ్యక్తులు, ఇతర రాష్ట్రాల్లోని సైబర్‌ నేర నెట్‌వర్క్‌లతో ఉన్న సంబంధాలను వెలికితీసేలా దర్యాప్తు కొనసాగుతోంది. కాగా, కమీషన్‌ వస్తుందని ఇతరుల కోసం ఖాతాలు తెరవడం లేదా వివరాలు ఇవ్వడం చేయొద్దని టీజీసీఎస్‌బీ సూచించింది. ఖాతాలు, ఏటీఎం కార్డులు, పిన్‌, ఓటీపీ, ఇతర బ్యాంకింగ్‌ వివరాలను ఎవరితోనూ పంచుకోవద్దని పేర్కొంది. ఇలాంటి ఖాతాలను సైబర్‌ నేరాలకు ఉపయోగిస్తే చట్టపరమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని టీజీసీఎస్‌బీ డైరెక్టర్‌ శిఖా గోయల్‌ మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.

జిల్లాకు చెందిన కొందరు తమ ఖాతాలను సైబర్‌ మోసాల ద్వారా వచ్చిన డబ్బు స్వీకరణ, బదిలీ కోసం మోసగాళ్లకు అందించినట్లు గతంలో నమోదైన కేసుల ద్వారా తెలిసింది. జిల్లాలోని వీఎం.బంజర, సత్తుపల్లి పోలీసుస్టేషన్లలో నమోదైన కేసుల్లో ఈ అంశాన్ని గుర్తించారు. ఖాతాలు ఇచ్చిన వారిలో వ్యాపారులు, కూలీలు, కార్మికులు, ప్రైవేట్‌ ఉద్యోగులు, నిరుద్యోగులు ఉండగా.. లావాదేవీలకు ఉపయోగించడంతో పాటు టెలిగ్రామ్‌ గ్రూపుల ద్వారా విదేశాలకు చెందిన చైనా ఆపరేటర్లతో లింకులు ఉన్నట్లు తేలింది. ఈ ఆపరేటర్ల సమన్వయంతో అక్రమ ఆన్‌లైన్‌ గేమింగ్‌కు సంబంధించిన నగదు చెల్లింపుల స్వీకరణకు ఉపయోగించినట్లు గుర్తించారు. ఈ కేసులు టీజీసీఎస్‌బీకి బదిలీ కావడంతో జిల్లాపై ప్రత్యేక నిఘా పెట్టారు.

ఈనెల 2, 3వ తేదీల్లో జిల్లాలోని పలు బ్యాంకు శాఖలు, ఏటీఎం కేంద్రాలు, అనుమానిత ప్రాంతాల్లో టీజీసీఎస్‌బీ ప్రత్యేక ఆపరేషన్‌ చేపట్టింది. ఈ సందర్భంగా బడిస మురళీకృష్ణ, వడ్లమూడి సాయినివాస్‌ను అరెస్టు చేశారు. వీరు సైబర్‌ నేరాల లావాదేవీలకు మ్యూల్‌ ఖాతాలను సమకూర్చినట్లు గుర్తించారు. వీఎం.బంజర, సత్తుపల్లిలో నమోదైన కేసుల్లో గతంలోనే 52 మంది అరెస్టయ్యారు.

10 మ్యూల్‌ ఖాతాల గుర్తింపు

సైబర్‌ దందా చేసే వాళ్లు మెసేజ్‌లు పంపి ఓటీపీ చెప్పమంటారు. అలాగే కమీషన్ల ఆశ చూపి బ్యాంకు ఖాతా వివరాలు అడుగుతారు. ఇలాంటి వారిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. కమీషన్లకు ఆశపడి మ్యూల్‌ ఖాతాలు తెరిస్తే నేరాల్లో భాగమైనట్టే. తద్వారా చట్టరీత్యా చర్యలు ఉంటాయి.

– సునీల్‌దత్‌, ఖమ్మం పోలీసు కమిషనర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement