ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఏఐసీసీ అధికార ప్రతినిధి అన్పుల్ అవిజిత్
పాల్వంచ: దేశ సామాజిక సమత, సమానత్వాల కోసం పోరాడిన మహానీయుడు మాజీ దేశ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ అని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఏఐసీసీ అధికార ప్రతినిధి, బాబూ జగ్జీవన్ రామ్ మనుమడు డాక్టర్ అన్పుల్ అవిజిత్ అన్నారు. శుక్రవారం బస్టాండ్ సెంటర్‌లో బాబూ జగ్జీవన్‌రామ్ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కాంస్య విగ్రహాన్ని వారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బడుగు, బలహీన, వర్గాలు, దళితుల హక్కుల కోసం బాబుజీ చేసి పోరాటాలు అజరామరమైనవని అన్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా దేశంలోని ఆహార ధాన్యాల కొరతను నివారించేందుకు హరిత విప్లవం తీసుకురావడంలో కీలక పాత్ర పోషించాడని కొనియాడారు. మానకొండూరు, కొత్తగూడెం ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, కూనంనేని సాంబశివరావు, మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య మాట్లాడుతూ అన్ని వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడ్డారని అన్నారు. ఈ సందర్బంగా వారిని గజమాలతో సత్కరించారు. ఏపూరి సోమన్న కళాబృందం ఆటాపాటతో అలరించింది. ఈ కార్యక్రమంలో మేయర్ మూడ్ గణేష్, సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్‌కె.సాబీర్‌పాషా, ఝాన్సీ, కొత్వాల శ్రీనివాసరావు, విగ్రహా కమిటీ అధ్యక్షుడు దండోర శ్రీను, కాల్వ భాస్కర్ రావు, కొత్తపల్లి సోమయ్య, కాల్వ దేవదాస్, ఎ.అబ్బురామ్, రవితేజ, కాల్వ ప్రకాష్, పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు.
నేటి నుంచి ‘సర్’పై ప్రత్యేక ప్రచారం
సూపర్‌బజార్(కొత్తగూడెం): అక్టోబర్ 1 అర్హత తేదీగా రాష్ట్రంలో నిర్వహిస్తున్న ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా క్లెయిమ్స్, అభ్యంతరాల స్వీకరణ కోసం జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఈ నెల 5, 6, 12, 13 తేదీల్లో ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ అంకిత్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఓటర్లు సంబంధిత పోలింగ్ స్టేషన్‌లో అందుబాటులో ఉంచిన ముసాయిదా ఓటర్ల జాబితాను పరిశీలించుకోవాలని సూచించారు. ఏవైనా తప్పులు ఉంటే లేదా కొత్తగా పేరు నమోదు, తొలగింపు, మార్పులు అవసరమైతే నిర్ణీత ఫారం–6, ఫారం–7, ఫారం–8 ద్వారా సంబంధిత బీఎల్‌ఓ, ఈఆర్‌ఓలకు అభ్యంతరాలు అందజేయవచ్చని పేర్కొన్నారు. బీఎల్‌ఓలు తప్పనిసరిగా అందుబాటులో ఉంటారని తెలిపారు.


