ఉత్తమ బోధన, ఫలితాల్లో ముందంజ
ప్రత్యేకంగా నిలుస్తున్న ఉపాధ్యాయులు
ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయుల్లో కొందరు ప్రత్యేకంగా నిలుస్తున్నారు. అవార్డులు వచ్చినా, రాకున్నా.. ఉన్నతాధికారులు గుర్తించినా, లేకున్నా... విద్యార్థుల అభివృద్ధే లక్ష్యంగా బోధన సాగిస్తున్నారు. వినూత్న పద్ధతుల్లో పాఠాలు చెబుతూ పిల్లల భవిష్యత్‌కు పాటుపడుతున్నారు. నేడు జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా అలాంటి వారిలో కొందరు ఉపాధ్యాయుల పరిచయం.
వైరా: అవార్డుల కోసం చూడకుండా, కరోనా సమయంలోనూ విద్యార్థులకు ఆన్‌లైన్‌లో పాఠాలు చెప్పి వారి భవిష్యత్‌కు బంగారు బాటలు వేస్తున్నారు వైరా మండలం ఖానాపురం ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయుడు బానోతు రామ్. 2006 డీఎస్సీలో ఉపాధ్యాయుడిగా ఎంపికై న ఆయన కొణిజర్ల మండలం సింగరాయపాలెం, వైరా మండలం దాచాపురం ప్రాథమికోన్నత పాఠశాలలో విధులు నిర్వర్తించాక 2018నుంచి ఖానాపురం పాఠశాలలో పని చేస్తున్నారు. 2023 నుంచి ఇప్పటివరకు ఆదివారం, ప్రభుత్వ సెలవులు తప్ప వ్యక్తిగత అవరాల కోసం రామ్ ఒక్క సెలవు కూడా తీసుకోకపోవడంవిశేషం. పాఠశాలలో మొత్తం 75 మంది విద్యార్థులు ఉండగా 1, 2వ తరగతుల విద్యార్థులకు చేతి రాతలో ప్రత్యేక తర్ఫీదు ఇచ్చేందుకు పుస్తకాలు సమకూరుస్తున్నారు. విద్యార్థులకు డిక్షనరీలు అందించి ఇంగ్లిషు బోధిస్తున్నారు. ఉదయం ముందుగా పాఠశాలకు వచ్చి వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ఈసీఆర్(ఎవ్రీ చైల్డ్ రీడింగ్)లో జిల్లాలోనే ఖానాపురం యూపీఎస్ ప్రథమ స్థానానా నిలిచింది. ఇవన్నీ కాక రామ్ తన కుమార్తె చరిత్రశ్రీని పనిచేసే పాఠశాలలో చేర్పించడం విశేషం. విద్యార్థుల పుట్టినరోజు సందర్భంగా పాఠశాలలో మొక్క నాటించి పర్యావరణంపై అవగాహన కల్పిస్తున్నారు.
ఇల్లెందురూరల్: క్రమశిక్షణ, తపన, సేవాదృక్పథంతో ఉపాధ్యాయుడు కబ్బాకుల రవి ఎక్కడ పనిచేసినా అధికారులు, తల్లిదండ్రుల ప్రశంసలు అందుకున్నారు. ఇల్లెందు మండలం ముత్తారపుకట్ట ప్రాథమిక పాఠశాలలో ఐదేళ్ల క్రితం రవి ప్రధానోపాధ్యాయుడిగా బాధ్యతలు స్వీకరించారు. ఇరుకు గదులు, అపరిశుభ్ర వాతావరణంలో ఉన్న పాఠశాలకు గ్రామస్తుల సహకారంతో ఒక రూపం తీసుకురావడంతో పాటు ప్రజాప్రతినిధుల సహకారంతో రెండు గదుల భవనం మంజూరు చేయించారు. దాతల చేయూతతో బెంచీలు, డిజిటల్ బోధన కోసం టీవీ సమకూర్చారు. అట్టలకు అక్షరాలను అతికించి వాటి ఆధారంగా పలక లేకుండానే బోధిస్తుండడంతో సత్ఫలితాలు వచ్చాయి. రోజూ పాఠశాలలో బోధించిన అంశాలను ఇంటి వద్ద మననం చేసుకునేలా విద్యార్థులను సన్నద్ధం చేశారు. తల్లిదండ్రులతో వాట్సాప్ గ్రూపు ఏర్పాటుచేసి విద్యార్థి చదువుకునే ఫొటో తీసి గ్రూప్‌లో పోస్ట్ చేసేలా అవగాహన కల్పించారు. ప్రతీనెల తల్లిదండ్రుల సమావేశం నిర్వహించి విద్యార్థుల ప్రగతి నివేదికలను ఇవ్వడంతో పాటు అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను బహుమతులతో ప్రోత్సహిస్తున్నారు. ఈ క్రమాన హెచ్‌ఎం రవి, సహ ఉపాధ్యాయుల కృషితో ముత్తారపుకట్ట పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 20నుంచి 60కి చేరింది. అంతేకాక గతేడాది నవోదయ ప్రవేశ పరీక్షలో పాఠశాల నుంచి హాజరైన విద్యార్థులందరూ అర్హత సాధించారు.
కొణిజర్ల: పుస్తకాలతో కుస్తీ పడుతూ బట్టీ పట్టే కాలం పోయింది. చదువు అంటే ర్యాంకుల వేటే కాదు జీవితాంతం గుర్తుండే జ్ఞానమని నిరూపిస్తున్నాడో ఉపాధ్యాయుడు. పనికి రావని పడేసిన వ్యర్థాలనే అస్త్రాలుగా మలిచి దాదాపు 150 రకాల టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్ తయారు చేసి తరగతి గదిని ప్రయోగశాలగా మార్చి పాఠాలు బోధిస్తూనే మూఢనమ్మకాలపై అవగాహన కల్పిస్తున్నారు కొణిజర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఫిజిక్స్ ఉపాధ్యాయుడు బానోత్ హనుమ. పరీక్షల కోసమే బోధన అన్నట్లు కాకుండా వారిలో జ్ఞానం పెంచాలనే సంకల్పంతో వ్యర్థాల సాయంతో టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్ తయారు చేశారు. ఇందులో న్యూటన్ గమన నియమాలు, జడత్వ నియమాలు, గురుత్వ కేంద్రం, విద్యుత్ ప్రవాహానికి సంబంధించిన ప్రయోగాలు, కాంతి పరావర్తన నియమాలు, సూర్య, చంద్ర గ్రహణ నమూనాలు వంటివి ఉన్నాయి. అంతేకాక మూఢనమ్మకాలను నిర్మూలించేలా అవగాహన కల్పిస్తారు. గాజు పెంకులపై నడవడం, నాలుకపై శూలాలు గుచ్చుకోవడం, అరచేతి నుంచి విభూతి రప్పించడం వంటివి శాసీ్త్రయంగా వివరిస్తారు. ఈక్రమంలో హనుమ ఈ ఏడాది రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు.
నేడు జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం


