పాల్వంచలో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి..
భద్రాచలం: భద్రాచలంలో జరుగుతున్న శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని రాష్ట్ర రెవెన్యూ, గృహ, నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అధికారులకు, కాంట్రాక్టర్‌కు సూచించారు. శుక్రవారం ఆయన భద్రాచలంలో పర్యటించారు. తొలుత స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ డిసెంబర్‌లో జరిగే ముక్కోటి ఉత్సవాలలోపు ఉత్తర ద్వారం అభివృద్ధి పనులు పూర్తి చేయాలని, వచ్చే ఏడాది ఏప్రిల్‌లో జరిగే శ్రీరామనవమి ఉత్సవాలలోపు అన్ని పనులు పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వచ్చే ఏడాది జూన్, జూలైలో జరిగే గోదావరి పుష్కరాల ప్రారంభంలోపు గోదావరి పరీవాహక ప్రాంతంలో ఘాట్ల నిర్మాణాలు, పూర్తి చేయాలని అన్నారు. అనంతరం పురుషోత్తపట్నంలో ఉన్న గోశాలలో రాజ గోపుర, ఇతర శిల్ప నిర్మాణ పనులకు కొబ్బరికాయ కొట్టి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ అంకిత్, భద్రాచలం, పినపాక, అశ్వారావుపేట ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, పాయం వెంకటేశ్వర్లు, జారే ఆదినారాయణ, ఐటీడీఏ పీఓ రాహుల్, ఆలయ ఈఓ దామోదర్, తహసీల్దార్ రవి కుమార్ తదితరులు పాల్గొన్నారు.
మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
భద్రాచలంఅర్బన్: పాల్వంచ మండలంలో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటుకు ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ(ఐఆర్‌సీఎస్) చర్యలు చేపడుతోంది. ఇందులో కేన్సర్ వ్యాధి నిర్ధారణ కేంద్రం, డయాలసిస్ సెంటర్, బ్లడ్‌బ్యాంక్ ఏర్పాటు చేయాలని శుక్రవారం సంస్థ ప్రతినిధులు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడిని కలిసి విన్నవించగా, ఆయన సానుకూలంగా స్పందించారు. తగిన చర్యలు చేపట్టాలని కలెక్టర్ అంకిత్‌ను ఆదేశించారు. ఐఆర్‌సీఎస్ జిల్లా కో ఆర్డినేటర్ ఎస్‌ఎల్ కాంతారావు, పి.వెంకటేశ్వరరెడ్డి, వై.సూర్యనారాయణ, జి.రాజారెడ్డి, వి.కామేశ్వరరావు, హరిశ్చంద్ర నాయక్, సోమరౌతు శ్రీనివాసరావు, డా.భాను ప్రసాద్, బి.సిద్ధారెడ్డి, ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.


