దమ్మపేట: తల్లి ఒడిలో సేదతీరాల్సిన పసికందు.. చెట్టు కింద ఉన్న పొదల మధ్య అనాథగా కనిపించింది. అప్పుడే పుట్టిన మగ శిశువును గుర్తుతెలియని వ్యక్తులు ఓ ఇంటి ప్రహరీ వెనక భాగాన చెట్టు కింద పొదలు, రాళ్లురప్పలు ఉన్న ప్రదేశంలో వదిలివెళ్లిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. దమ్మపేట మండలం పట్వారీగూడెం ఎస్సీ కాలనీలోని ఓ ఇంటి ప్రహరీ వెనుక ఉన్న పొదల నుంచి గురువారం తెల్లవారుజామున పసికందు ఏడుపు వినిపించింది. దీంతో ఇంట్లోని మహిళ వెళ్లి చూడగా అప్పుడే పుట్టిన మగశిశువు కనిపించింది. బుధవారం అర్ధరాత్రి ప్రసవించిన పసికందును అక్కడ వదిలేసి వెళ్లినట్లు తెలుస్తోంది. దీంతో సదరు మహిళ ఆ శిశువును సత్తుపల్లిలోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయిస్తుండగా పోలీసులు ఘటనాస్థలంలో వివరాలు సేకరించారు. అయితే, పట్వారిగూడెంలో ఉండే ఐసీడీఎస్ సిబ్బంది శుక్రవారం వరకు స్పందించలేదు. చికిత్స అనంతరం శుక్రవారం శిశువును పోలీసులకు సదరు మహిళ అప్పగించాక ఐసీడీఎస్ సీడీపీఓ హేమసత్య, సిబ్బందితో చేరుకుని శిశువును సంరక్షణలోకి తీసుకున్నారు. అనంతరం భద్రాచలంలోని శిశుగృహకు తరలించగా.. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
మానవత్వం చూపిన ఓ మాతృమూర్తి


