అత్యవసర వేళ.. సత్వర వైద్యం | - | Sakshi
Sakshi News home page

అత్యవసర వేళ.. సత్వర వైద్యం

Sep 3 2026 3:57 AM | Updated on Sep 3 2026 3:57 AM

అండగా నిలిచిన భద్రాచలం వైద్య బృందం

చిన్నారుల ఆరోగ్యంపై నిరంతర పర్యవేక్షణ, మెరుగైన చికిత్స

భద్రాచలంఅర్బన్‌: భద్రాచలం సరిహద్దు ఏపీలోని ఎటపాక మండలంలో అస్వస్థతకు గురైన చిన్నారులు, పెద్దలు పెద్ద సంఖ్యలో భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో చేరారు. మంగళవారం రాత్రి ఒకేసారి పెద్దసంఖ్యలో బాధితులు చేరడం, అత్యవసర పరిస్థితి ఎదురైనా వైద్యులు, నర్సులు, సిబ్బంది సత్వరం స్పందించి వైద్యసేవలు అందించారు. మొత్తం 80 మందిలో ఒకరు మృతి చెందగా, మిగిలిన వారిలో 13 మందికి మలేరియా పాజిటివ్‌గా తేలినట్లు సమాచారం. కాగా, మంగళవారం సాయంత్రం 7గంటల వరకు ఆస్పత్రిలో కేవలం పది మంది సిబ్బంది మాత్రమే అందుబాటులో ఉండగా విషయం తెలిసి 50 – 60 మంది వరకు వైద్య బృందం చేరుకుని సమన్వయంతో పనిచేశారు. తీవ్ర ఆందోళన చెందిన చిన్నారుల తల్లిదండ్రులకు ధైర్యం చెబుతూ, వారి ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన చికిత్స చేస్తున్నారు.

అధికారుల ప్రశంసలు..

చికిత్స పొందుతున్న వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవడంతో పాటు ఆస్పత్రిలో వైద్య సేవలపై ఆరా తీసేందుకు రంపచోడవరం ఎమ్మెల్యే శిరీష, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, పోలవరం కలెక్టర్‌ దినేష్‌తో పాటు ఇతర అధికారులు బుధవారం భద్రాచలం ఏరియా ఆస్పత్రిని సందర్శించారు. అత్యవసర సమయంలో భద్రాచలం ఏరియా ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది అందించిన సేవలను కలెక్టర్‌ దినేష్‌ అభినందించారు. ఆస్పత్రికి అవసరమైన మందుల జాబితాను అందిస్తే వాటిని సమకూర్చేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పినట్లు తెలిసింది. అలాగే, మంగళవారం రాత్రి నుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు, వారి కుటుంబ సభ్యులకు స్థానికులు, ఆస్పత్రి నిర్వాహకుల సమన్వయంతో భోజన ఏర్పాట్లు చేశారు.

తల్లిదండ్రుల హర్షం..

ఒకేసారి 80 మంది ఆస్పత్రిలో చేరినా క్లిష్ట పరిస్థితుల్లో పరిమిత సిబ్బందితో ప్రారంభమైన వైద్య సేవలు కొద్ది గంటల్లోనే అత్యవసర స్పందనగా మారింది. వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది సమష్టి కృషితో తమ పిల్లలకు అండగా నిలిచి చికిత్స అందించడంపై తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.

అస్వస్థతతో వచ్చిన ఏపీ వాసులు 80 మంది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement