నేడు మంత్రి పొంగులేటి పర్యటన | - | Sakshi
Sakshi News home page

నేడు మంత్రి పొంగులేటి పర్యటన

Sep 3 2026 3:57 AM | Updated on Sep 3 2026 3:57 AM

ఖమ్మంమయూరిసెంటర్‌: రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గురువారం ఉమ్మడి జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం ఈశ్వరమాదారం, పాలేరులో మంత్రి పర్యటిస్తారు. అలాగే, కూసుమంచిలో జీపీ భవన నిర్మాణానికి, 11 గంటలకు ఏదులాపురం మున్సిపాలిటీ 22వ వార్డులో గిరిజన బాలుర వసతిగృహ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. ఆతర్వాత ఖమ్మంలో ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ అభ్యర్థులకు ఉచిత శిక్షణను ప్రారంభిస్తారు. అనంతరం మధ్యాహ్నం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్‌లో సమీక్షించనున్న మంత్రి, సాయంత్రం ములకలపల్లి మండలం చౌటిగూడెంలో ఇటీవల హత్యకు గురైన నర్స్‌ కుటుంబాన్ని పరామర్శిస్తారు.

సీజనల్‌ వ్యాధుల కట్టడికి ముందస్తు చర్యలు

భద్రాచలంఅర్బన్‌: వర్షాకాలంలో ఏజెన్సీ ప్రాంతంలో డెంగీ, మలేరియా, వైరల్‌ జ్వరాల వ్యాప్తికి అవకాశం లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని డీఎంహెచ్‌ఓ తుకారం రాథోడ్‌ ఆదేశించారు. భద్రాచలం ఐటీడీఏలో బుధవారం అధికారులతో ఆయన పలు అంశాలపై సమీక్షించారు. సమస్యాత్మక గ్రామాల్లో తొలి విడత ఇంటీరియర్‌ రెసిడ్యువల్‌ స్ప్రే నిర్వహించి, 30 రోజుల వ్యవధిలో రెండోసారి చేపట్టాలని తెలిపారు. ఆర్‌డీటీ పరీక్షల్లో మలేరియా పాజిటివ్‌గా తేలిన కేసులకు తప్పనిసరిగా రక్త నమూనాలు సేకరించి జిల్లా, రాష్ట్రస్థాయి ప్రయోగశాలలకు పంపాలని చెప్పారు. అలాగే, పోషకాహార వారోత్సవాలు, నేత్రదాన పక్షోత్సవాల నిర్వహణపై సూచనలు చేశారు. వివిధ విభాగాల అధికారులు సైదులు, శ్రీధర్‌, నగేష్‌ తదితరులు పాల్గొన్నారు.

విత్తనోత్పత్తికి రైతులు ముందుకు రావాలి

బూర్గంపాడు: క్షేత్రస్థాయిలో విత్తన ఉత్పత్తికి రైతులు ముందుకు రావాలని కొత్తగూడెం కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ భరత్‌ సూచించారు. బూర్గంపాడు మండలం నాగినేనిప్రోలు, సంజీవరెడ్డిపాలెం గ్రామాల్లో తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, నాబార్డు, పీఏసీఎస్‌ సంయుక్త ఆధ్వర్యాన నిర్వహిస్తున్న సీడ్‌ ఉత్పత్తి రైతు క్షేత్రాలను బుధవారం శాస్త్రవేత్తలు పరిశీలించారు. ఈ సందర్భంగా భరత్‌ మాట్లాడుతూ రైతులు మేలైన విత్తనాలను ఎంపిక చేసుకుని స్థానిక అవసరాలకు తగినట్లుగా పండించాలన్నారు. అంతేకాక సొంతంగా విత్తనోత్పత్తితో అధిక లాభాలను సాధించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతులు గాదె వెంకటేశ్వరరెడ్డి, మేకల నర్సింహారావు, కైపు రోశిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement