సూపర్‌బజార్(కొత్తగూడెం): తెలంగాణ రాష్ట్రానికి, ప్రజలకు కేసీఆర్ పాలనే శ్రీరామరక్ష అని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర పేర్కొన్నారు. కాంగ్రెస్ వెయ్యిరోజుల పాలనలో హామీలు అమలు చేయలేదని ఆరోపిస్తూ జిల్లా కేంద్రంలోని సూపర్‌బజార్ సెంటర్‌లో బుధవారం బీఆర్‌ఎస్ ఆధ్వర్యాన నిర్వహించిన నిరసనలో ఎంపీ రవిచంద్ర మాట్లాడారు. ఎలాగైనా అధికారంలోకి రావాలనే కుట్రతో అబద్దాల పునాదులపై కాంగ్రెస్ నోటికొచ్చిన హామీలిచ్చి ప్రజలను మోసం చేసిందన్నారు. ఆరు గ్యారంటీలు, 432 హామీలు, 13 డిక్లరేషన్ల పేరుతో ప్రజలను దగా చేశారని విమర్శించారు. రైతన్నలకు రూ.2 లక్షల చొప్పున రూ.49వేల కోట్లు రుణమాఫీ చేస్తామని చివరకు రూ.18వేల కోట్లు మాత్రమే చేసిందన్నారు. రైతుభరోసా పేరిట ఎకరాకు రూ.15 వేల చొప్పున ఇస్తామని చెప్పి మాట మార్చిందని మండిపట్టారు. అంతేకాక ప్రభుత్వం రైతుబీమా ఎగ్గొట్టిందని, కౌలు రైతుల సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదని, సాగునీళ్లు లేవంటే వరద నీళ్లను కిందకు వదిలిపెడుతూ సీఎం రేవంత్‌రెడ్డి తన గురుదక్షిణ చెల్లించుకుంటున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పాలనలో ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదని, ప్రజలంతా తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నారు. ఉద్యోగులకు పీఆర్సీ లేదని, ఆరు డీఏలు లేవని, ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ కాక నిరుద్యోగ యువత, ఫీజుల బకాయిలు అందక విద్యార్థులు, ఇస్తామన్న సాయం అందక ఆటో డ్రైవర్లు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను అమలు చేయకపోవడంతో మహిళలు పాలకులపై మండిపడుతున్నారని వివరించారు. రేవంత్‌రెడ్డి తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు కేసీఆర్, కేటీఆర్, హరీష్‌రావులను తిడుతున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్, బీజేపీలు ఒక్కటేనని ఆ రెండు పార్టీల నాయకులు అధికారంలో లేని బీఆర్‌ఎస్‌ను అణచివేయాలని కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. కేసీఆర్ ముచ్చటగా మూడోవసారి ముఖ్యమంత్రి కావడం ఖాయమని అన్నారు. కాగా, కొత్తగూడెం రైల్వేస్టేషన్ సెంటర్‌లో మానవహారంగా ఏర్పడి, కాంగ్రెస్ హామీలతో కూడిన 420 మీటర్ల భారీ బ్యానర్‌ను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ కాపు సీతాలక్ష్మి, మాజీ వైస్ చైర్మన్ దామోదర్‌తో పాటు ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు.
నిరసనలో రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర


