రాములోరి ఆలయ పనుల పై దృష్టి | - | Sakshi
Sakshi News home page

రాములోరి ఆలయ పనుల పై దృష్టి

Sep 3 2026 3:57 AM | Updated on Sep 3 2026 3:57 AM

● రేపు పరిశీలించనున్న మంత్రి పొంగులేటి ● 7న ఆంజనేయస్వామి కళావాహణ

● రేపు పరిశీలించనున్న మంత్రి పొంగులేటి ● 7న ఆంజనేయస్వామి కళావాహణ

భద్రాచలం: భద్రాచలంలోని శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం అభివృద్ధి పనులను రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శుక్రవారం పరిశీలించనున్నారు. దేవస్థానంలో ఇప్పటికే దక్షిణ, పడమర, ఉత్తర మెట్లను తొలగించి పనులను చేపడుతుండగా.. ఉత్తర దిక్కున ముక్కోటి నాటికి ఉత్తర ద్వారాన్ని సిద్ధం చేసేందుకు పనుల్లో వేగం పెంచారు. అలాగే,పడమర దిక్కున ఉన్న శ్రీ అభయాంజనేయస్వామి ఉపాలయాన్ని సైతం పునఃనిర్మించనున్నారు. తొలుత ప్లాన్‌లో ఈ ఉపాలయం లేనప్పటికీ తాజాగా దీనిని చేర్చారు. దీంతో స్వామి వారి విగ్రహాలను తొలగించేందుకు ఈ నెల 7వ తేదీన కళావాహన జరపనున్నారు. కాగా, మంత్రి పొంగులేటి పర్యటించనున్న నేపథ్యాన స్థానిక ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్‌ బుధవారం ఆలయ పరిసరాలను పరిశీలించి పనుల పురోగతిపై ఆరా తీశారు. నాణ్యతతో, భక్తులు మెచ్చేలా పనులు జరగాలని నిర్మాణ సంస్థ బాధ్యులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ దామోదర్‌రావు, ఈఈ రవీందర్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.

కమనీయంగా రామయ్య కల్యాణం..

దేవస్థానంలో బుధవారం రామయ్య కల్యాణం కమనీయంగా జరిగింది. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజల అనంతరం నిత్య కల్యాణానికై బేడా మండపంలో కొలువుదీరిన స్వామి వారికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవేత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్య కల్యాణమహోత్సవాన్ని శాస్త్రోక్తంగా, సంప్రదాయబద్ధంగా జరిపారు. భక్తులు ఆర్జిత సేవల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement