2,40,438 మంది ఓటర్లకు చిక్కులు | - | Sakshi
Sakshi News home page

2,40,438 మంది ఓటర్లకు చిక్కులు

Sep 2 2026 2:46 AM | Updated on Sep 2 2026 2:46 AM

ఎస్‌ఐఆర్‌లో ముమ్మరంగా నోటీసుల జారీ ప్రక్రియ

ఇప్పటికే 54 వేల మందికి పంపిణీ

ఆధారాలతో బీఎల్వోలను ఆశ్రయిస్తున్న ఓటర్లు

జిల్లాలో నోటీసులు అందించే ఓటర్ల వివరాలు

చుంచుపల్లి: జిల్లాలో సుమారు 2.40 లక్షల మంది అనామలీస్‌, అన్‌మ్యాపింగ్‌ ఓటర్లను గుర్తించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియలో భాగంగా వీరందరికీ నోటీసులు జారీ చేస్తున్నారు. ఇందులో అనామలీస్‌ ఓటర్లు 1,80,229 మంది, 60,206 మంది అన్‌మ్యాపింగ్‌ ఓటర్లు ఉన్నారు. వీరిలో ఇప్పటివరకు 54,547 మందికి బీఎల్వోలు నోటీసులు అందజేశారు. ఓటరు వివరాల్లో వ్యత్యాసాలను పరిశీలించేందుకు ఈ ప్రక్రియ చేపట్టారు. నోటీసులు అందినంత మాత్రాన ఓటు తొలగించినట్లు కాదని, నోటీసులో పేర్కొన్న వివరాల మేరకు బీఎల్‌ఓలకు ఆధారాలను సమర్పించాలని అధికారులు సూచిస్తున్నారు. సమర్పించిన పత్రాలను పరిశీలించిన అనంతరం నిబంధనల ప్రకారం తదుపరి చర్యలు తీసుకోనున్నారు. నోటీసుల పంపిణీతో తమ పేర్లు ఓటర్ల జాబితాలో కొనసాగుతాయా..? అనే సందేహంతో పలువురు ఆందోళన చెందుతున్నారు. ఓటరు గుర్తింపు కార్డు, ఆధార్‌, పాస్‌పోర్టు, డ్రైవింగ్‌ లైసెన్స్‌, బ్యాంకు పత్రాలు, నివాస, కుల ధ్రువీకరణ, విద్యాభ్యాసం వంటి తదితర 11 రకాల ఆధారాలను పరిశీలనకు సమర్పిస్తున్నారు.

అవగాహనకు ప్రత్యేక ప్రచారం

ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ(ఎస్‌ఐఆర్‌)పై అవగాహన కల్పించేందుకు జిల్లాలోని 1,127 పోలింగ్‌ కేంద్రాల్లో ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అక్టోబర్‌ 1 తేదీ వరకు చేపట్టనున్న క్లెయిమ్స్‌, అభ్యంతరాలు స్వీకరించనున్నారు. పోలిగ్‌ కేంద్రాల్లో ఈ నెల 5, 6 తేదీల్లో తొలి విడత, ఈనెల 12, 13 తేదీల్లో రెండో విడత ప్రత్యేక ప్రచారం నిర్వహిస్తారు. ముసాయిదా ఓటరు జాబితాలను అందుబాటులో ఉంచుతారు. జాబితాలో పేరు లేకపోవడం, తొలగింపు, వివరాల్లో మార్పులు లేదా ఇతర అభ్యంతరాలు ఉంటే నిర్ణీత ఫారాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఫారం–6 ద్వారా కొత్త ఓటరు నమోదుకు, ఫారం–7 ద్వారా అభ్యంతరాలు, తొలగింపు, ఫారం–8 ద్వారా వివరాల సవరణకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆయా తేదీల్లో బూత్‌ లెవల్‌ అధికారులు నిర్దేశిత ప్రదేశాల్లో తప్పనిసరిగా అందుబాటులో ఉంటారు. రాజకీయ పార్టీల బూత్‌ లెవల్‌ ఏజెంట్లు, ఓటర్లు పేరు, వయస్సు, చిరునామా తదితర వివరాలను ముసాయిదా జాబితాలో పరిశీలించుకోవచ్చు. ఏవైనా తప్పులు లేదా అభ్యంతరాలు ఉంటే బీఎల్వోలు లేదా ఈఆర్వో కార్యాలయంలో నిర్ణీత ఫారాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఇళ్లకు తాళాలు వేసి ఉండటం, చిరునామాలు సరిగా లేకపోవడంతో నోటీసుల జారీకి బీఎల్‌ఓలు రెండు సార్లు తిరగాల్సి వస్తోంది.

నియోజకవర్గం నోటీసులు ఇప్పటికే

ఇచ్చే ఓటర్లు జారీ చేసినవి

పినపాక 56,091 5,144

కొత్తగూడెం 70,174 12,186

భద్రాచలం 34,502 9,296

అశ్వారావుపేట 36,354 11,223

ఇల్లెందు 43,317 16,698

మొత్తం 2,40,438 54,547

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement