చెట్టు పేరు చెప్పి.. తారు రోడ్డును తవ్వేసి.. | - | Sakshi
Sakshi News home page

చెట్టు పేరు చెప్పి.. తారు రోడ్డును తవ్వేసి..

Sep 2 2026 2:46 AM | Updated on Sep 2 2026 2:46 AM

● అధికార పార్టీకి కొమ్ముకాస్తున్న అధికారులు ● ధ్వంసం అవుతున్న న్యూ గొల్లగూడెం రోడ్డు అధికారులకు సూచించినా..

● అధికార పార్టీకి కొమ్ముకాస్తున్న అధికారులు ● ధ్వంసం అవుతున్న న్యూ గొల్లగూడెం రోడ్డు

సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ప్రభుత్వ పథకాలు, విధానాలను క్షేత్రస్థాయిలో అమలు చేసే అధికార యంత్రాంగం సామాన్యుల పట్ల ఒకలా రాజకీయ నాయకుల పట్ల మరోలా వ్యవహరిస్తోందనే విమర్శలు మరోసారి రుజువయ్యాయి. న్యూగొల్లగూడెం రోడ్డులో తాజాగా జరిగిన ఘటనే ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. న్యూగొల్లగూడెం రోడ్డులో కొన్ని రోజులుగా మిషన్‌ భగీరథ పైప్‌ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. పనులకు అడ్డుగా ఉన్న సామాన్యుల ఇళ్లు, ప్రహరీ, అరుగులు, గద్దెలను తొలగించారు. కానీ అధికార కాంగ్రెస్‌ పార్టీ నాయకుడి ఇంటి దగ్గరకు వచ్చేసరికి ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. పైపు లైన్‌ అలైన్‌మెంట్‌ ఒక్కసారిగా కుడి వైపునకు మీటరు వరకు జరిగింది. ఫలితంగా కొత్తగా నిర్మించిన న్యూ గొల్లగూడెం–సూపర్‌బజార్‌ రోడ్డును జేసీబీతో తవ్వుతూ పైపులు అమర్చుతున్నారు. పైప్‌లైన్‌ అలైన్‌మెంట్‌ మార్పుపై కొత్తగూడెం మున్సిపల్‌ కార్పొరేషన్‌ పబ్లిక్‌ వర్క్స్‌ ఏఈ శ్రీనివాస్‌ను వివరణ కోరగా.. నిర్మాణానికి రెండు చెట్లు అడ్డుగా వచ్చాయని తెలిపారు. ఈ రెండు చెట్లు సరిగ్గా సదరు అధికార పార్టీ నాయకుడికి చెందిన మిల్లు, ఇంటి పక్కనే ఉండటం గమనార్హం. దీంతో అధికార పార్టీ నాయకుడి ప్రహరీకి చిన్న గీత పడకుండా, ఆ పక్కన ఉన్న మినీ గార్డెన్‌లోని మొక్కల ఆకులు సైతం రాలిపోకుండా ఎంతో జాగ్రత్తగా పైప్‌లైన్‌ నిర్మాణ పనులు కార్పొరేషన్‌ అధికారులు చేపడుతున్నారని ఈ ప్రాంత వాసులు చెప్పుకుంటున్నారు. గతంలో ఇదే రోడ్డు పక్కన నిర్మించిన డ్రెయినేజీ విషయంలోనూ ఇదే న్యాయాన్ని ఎంతో నియమనిష్టలతో పాటించిన విషయాన్ని గుర్తు చేసుకుంటున్నారు.

డ్రెయినేజీ పక్క నుంచే పైప్‌లైన్‌ నిర్మించాలని అధికారులకు, సిబ్బందికి సూచించాం. అయినా సూచనను ఖాతరు చేయకుండా కొత్త రోడ్డును ధ్వంసం చేస్తున్నారు. దీని వల్ల స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు తీరు మార్చుకోవాలి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలి.

–బానోత్‌ కళావతి,

52వ డివిజన్‌ కార్పొరేటర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement