సూపర్‌బజార్(కొత్తగూడెం): సీపీఎస్(కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్)ను రద్దు చేసి, ఓపీఎస్‌ను పునరుద్ధరించాలని ప్రభుత్వ ఉద్యోగులు నిరసన తెలిపారు. మంగళవారం పెన్షన్ విద్రోహ దినం సందర్భంగా టీజీ ఈజేఏసీ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన విరామ సమయంలో కలెక్టరేట్ ఎదుట నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన ప్రదర్శన చేపట్టారు. సీపీఎస్‌ను రద్దు చేయాలని నినదించారు. ఈ సందర్భంగా జేఏసీ జిల్లా చైర్మన్ అమరనేని రామారావు, కన్వీనర్ సంగం వెంకట పుల్లయ్య మాట్లాడుతూ పెన్షన్ ఉద్యోగికి ఇచ్చే వరం కాదని, సామాజిక భద్రత, హక్కు అని అన్నారు. సీపీఎస్ విధానంలో పెన్షన్ ప్రయోజనాలు పెట్టుబడుల రాబడిపై ఆధారపడటంతో ఉద్యోగుల భవిష్యత్తులో అనిశ్చితి ఏర్పడుతోందని విమర్శించారు. జిల్లా కేంద్రంతోపాటు మండల, డివిజన్ కేంద్రాలు, వివిధ కార్యాలయాల్లో ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమాలు నిర్వహించారని అన్నారు. ఈ నెల 10న నిర్వహించనున్న చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. జేఏసీ నాయకుల రాజు, ఎం.వెంకటేశ్వరరావు, లాల్ మహమ్మద్, తుక్కాని శ్రీనివాసరెడ్డి, హరిలాల్, లక్ష్మణ్ నాయక్, వనమా శ్రీనివాస రావు, డీవీ దినేష్ మాట్లాడారు..ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు కృష్ణయ్య, దస్రు, రాణి, రమేష్, కామేశ్వరరావు, వెంకటేశ్వరరావు, విజయలక్ష్మి, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
కలెక్టరేట్ ఎదుట ప్రభుత్వ
ఉద్యోగ జేఏసీ నిరసన


